మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి

May 14,2024 21:35

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న న్యాయమూర్తి కంపల్లె శైలజ

                  హిందూపురం : మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి సంయుక్తంగా కృషి చేద్దామని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ సూచించారు. మంగళవారం స్థానిక అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ఎంతో ఉత్తమం అన్నారు. దీనివల్ల ఎలాంటి వ్యయప్రాయాసాలకు గురికావాల్సిన అవసరం ఉండదన్నారు. వివాహ సంబంధ కేసులు భరణం చెల్లింపు కేసులు పిల్లలను అప్పగించడం వంటి కేసులు, ఇళ్ల వద్ద జరిగే చిన్నపాటి తగాదాల కేసులు, ఉద్యోగులు, సంస్థల మధ్య నమోదైన కేసులు తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. వాది, ప్రతివాదులు మధ్యవర్తిత్వానికి సంబంధించి లిఖితపూర్వకంగా తెలియజేస్తే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మధ్యవర్తిత్వంపై చర్చలు జరపడం జరుగుతుందన్నారు. ఆయా బాధితులతో కలిపి, వేరువేరుగా, న్యాయమూర్తుల సమక్షంలో చర్చలు, అవగాహన కల్పించిన అనంతరం కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. వాది, ప్రతివాదుల పూర్తి సమ్మతం మేరకు కేసును పరిష్కరించి డిగ్రీ మంజూరు చేయడం జరుగుతుందని ఏడిజే తెలిపారు. న్యాయవాదులు తమ పరిధిలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోగలిగే కేసులను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాస్‌ రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజశేఖర్‌, న్యాయవాదులు హిదయతుల్లాఖాన్‌, శ్రీరాములు, కళావతి పార్వతి, సుధాకర్‌, సుకుమార్‌, రకీబ్‌, వెంకటేష్‌, సందీప్‌తోపాటు లోక్‌ అదాలత్‌ సిబ్బంది హేమావతి, శారద తదితరులు పాల్గొన్నారు.

➡️