పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చేతన్‌

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌

పరిశ్రమల స్థాపనకు జిల్లాలో ముందుకు వచ్చే అవుత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు అందించి ప్రోత్సహించాలని కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ నాగరాజు ఏపీఐసీసీ జోనల్‌ మేనేజర్‌ సోనీ సుహాని సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిఎంఈజిపి పథకం కింద నిరుద్యోగ యువతకు విరివిగా రుణాలు అందించాలన్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. ఇదివరకే పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన ప్లాట్‌లలో పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పరిశ్రమ స్థాపనకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎలాంటి పెండింగ్‌ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. సింగిల్‌ డెస్క్‌ పోస్టల్‌లో పెండింగ్‌లో ఉన్న పది పరిశ్రమలకు సంబంధించి అనుమతులు మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించారు. పెండింగ్‌లో ఉన్న వాటిని ఈనెల 31వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని పర్యావరణ ఇంజినీర్‌ భూగర్భ జల విభాగంలో పెండింగ్‌ ఉన్న దరఖాస్తులను సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పిఎంఈజిపి కింద దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకులు పరిశీలించి రుణాలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డిఎం రమణకుమార్‌, డిపిఒ సమత, కమిషనర్‌ ప్రహ్లద, నైపుణ్య అభివద్ధి అధికారి రాజేష్‌, సాంఘిక సంక్షేమ అధికారి శివ రంగ ప్రసాద్‌, నాబార్డ్‌ ప్రతినిధి అనురాధ, డిక్కీ ప్రతినిధి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️