హమాలీలకు ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి

Jun 11,2024 22:08

సమావేశంలో పాల్గొన్న నాయకులు

                    కదిరి టౌన్‌ : సివిల్‌ సప్లై గౌడౌన్‌లో పనిచేస్తున్న హామాలీలకు ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌. వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని స్టాక్‌ పాయింట్‌ వద్ద కదిరి డివిజన్‌లోని ముదిగుబ్బ, కదిరి, గాండ్లపెంట, తనకల్లు, ఓడిసి మండలాల్లోని స్టాక్‌ పాయింట్ల హమాలీల జనరల్‌ బాడీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇఎస్‌. వెంకటేష్‌ మాట్లాడూతూ సివిల్‌ సప్లై హమాలీలకు 3 నెలలుగా డీలర్స్‌ నుంచి వస్తున్న కూలి చెల్లింపులో నిర్లక్ష్య ధోరణీ జరుగుతోందని విమర్శించారు. ఆరు ఏడు సంవత్సరాలుగా పనిచేసిన హమాలీల పేర్లను వెంటనే పిఎఫ్‌ కు సంబంధించిన లిస్ట్‌ లోకి ఎక్కించాలని డిమాండ్‌ చేశారు. శ్రీ సత్య సాయి జిల్లాలోని 12 స్టాక్‌ పాయింట్లలో 200 మందికి పైగా ఉన్న హమాలీలు అనేక సవత్సరాలగా పనిచేస్తున్నారన్నారు. గతంలో డీలర్స్‌ ద్వారా కూలి చెల్లించేవారని అన్నారు. ఆరు నెలల క్రితం కాంట్రాక్టర్‌ ద్వారా కూలి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. నెల నెలా కూలి చెల్లించకపోవడంతో హమాలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేసిన పనికి కూలి ఆడితే తమకు సంబంధం లేదని అనేక స్టాక్‌ పాయింట్లలో ఉన్న కాంట్రాక్టర్లు అంటున్నారన్నారు. 12 స్టాక్‌ పాయింట్లలో దాదాపు 60 మంది హమాలీలకు పిఎఫ్‌ లో పేర్లు నమోదు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే అనేక రూపాల్లో అధికారులను కోరామన్నారు. స్వీపర్‌, వాచ్‌మెన్‌లకు 7 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే వారు ఎలా పనిచేస్తారని అన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా హమాలీల సమస్యల పట్ల దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్‌ నరసింహులు, కదిరి పట్టణ కార్యదర్శి జగన్‌, సివిల్‌ సప్లై వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, మేస్త్రీలు ఫక్రుద్దీన్‌, కొండయ్య, కిష్ట, సూరి, వెంకటరమణ, శివ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️