వినతిని ఇస్తున్న సిఐటియు నాయకులు, పారిశుధ్య కార్మికులు
హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్మికులు కోరారు. మంగళవారం ఈ విషయంపై పట్టణంలోని ఎమ్మేల్యే బాలకృష్ణ నివాసంలో టిడిపి ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రావును సిఐటియు ఆద్వర్యంలో నాయకులు కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సిఐటియు పట్టణ కన్వీనర్ రాము, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి జగదీష్ మాట్లాడుతు, పురపాలక సంఘాన్నే నమ్ముకుని దాదాపు 35 సంవత్సరాల నుండి 220 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. గత వైసిపి ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో పని చేసే వారందరిని పర్మినెంట్ చేస్తామని చెప్పి మాటతప్పిందన్నారు. దీంతో పాటు ఆప్కాస్ విధానం తీసుకువచ్చిందన్నారు. ఈ విధానం వల్ల విశ్రాంతి పొందిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక పోగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సైతం ఇవ్వ లేదన్నారు. హిందూపురం పురపాలక సంఘంలో గత కొంత కాలంగా ఆప్కాస్ విదానంలో పని చేస్తున్న 10 మంది కార్మికులు మృతి చెందారని వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని అన్నారు. దీంతో కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఉందన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తొలగిస్తున్నారు. కరోనా మహామ్మారి సమయంలో కొంత మందిని అదనపు పారిశుధ్య కార్మికులుగా పురపాలక సంఘం వారు తీసుకున్నారని వారికి జీవో నెంబరు 36 ప్రకారం వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున, సహాయ కార్యదర్శి గురునాథ్, కోశాధికారి ఆనంద్, జాయింట్ సెక్రెటరీ చంద్ర, ఉపాధ్యక్షులు రామచంద్ర, నాయకులు బాబయ్య, రమేష్, మహిళా నాయకులు ఓబులమ్మ, సుబ్బలమ్మ తదితరులు పాల్గొన్నారు.