పెండింగ్‌ కేసులపై దృష్టి సారించండి : ఎస్పీ

సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ రత్న

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ వి.రత్న ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లాలోని సబ్‌ డివిజన్‌ వారీగా డీఎస్పీలు, సిఐలతో పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి వాటిపై సమీక్షించారు. గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, హత్యలు, చోరీ వంటి కేసుల పరిష్కారంపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. ఇప్పటికే ఆయా కేసుల్లో నిందితులుగా అరెస్ట్‌ అయిన కేసుల్లో త్వరిత ఛార్జిషీట్‌ దాఖలు చేసి, భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌, గ్యాంబ్లింగ్‌, మట్కాను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు, బీట్స్‌, పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్‌, మహేష్‌, హేమంత్‌ కుమార్‌, ఆదినారాయణ ఎస్‌బి సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, డిసిఆర్‌బి సిఐ శ్రీనివాసులు, సైబర్‌ సెల్‌ సిఐ తిమ్మారెడ్డి, డిటిఆర్‌బి సిఐ సతీష్‌, ఐటి కోర్‌ ఇన్‌ఛార్జి సుదర్శన్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️