‘అనంత’లో ఫుట్‌బాల్‌ సంబురం

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

ఇటీవలే జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నీకి అనంతపురం వేదికైన విషయం తెలిసిందే. తాజాగా పుట్‌బాల్‌ జాతీయ స్థాయి పోటీకి మరోమారు అనంతపురం వేదిక అవనుంది. ఈ మేరకు అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్పోర్ట్సు కాంప్లెక్సులో ప్రతిష్టాత్మక సంతోష్‌ ట్రోఫీ నాలుగు రోజులపాటు జరుగనుంది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, తమిళనాడు, అండమాన్‌, నికోబార్‌ జట్లు పాల్గొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపడుతోంది. దులీప్‌ట్రోఫిని విజయవంతంగా నిర్వహించనట్టు సంతోష్‌ ట్రోఫీని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది.

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు..

         సంతోష్‌ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహించే అవకాశం లభించింది. 40 ఏళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రంలో ఈ టోర్నమెంట్‌ నిర్వహించే అవకాశం రాలేదు. అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్పోర్ట్సు కాంప్లెక్సులో ఫుట్‌బాల్‌ గ్రౌండ్స్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో, మౌలిక సదుపాయాలు కూడా ఉండటంతో ఆల్‌ఇండియా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఈసారి ఈ టోర్నీని ఇక్కడ నిర్వహించడానికి అనుమతినిచ్చారు. ఇది వరకు జాతీయ స్థాయి బాలికల పుట్‌బాల్‌ టోర్నీ కూడా ఇక్కడ జరిగింది. ఇప్పుడు సంతోష్‌ ట్రోఫికి అనంతపురం జిల్లా వేదిక కానుంది. ఈ మ్యాచ్‌ ప్రారంభోత్సవానికి ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కళ్యాణ్‌ దుబే, రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి శ్రీధర్‌లు హాజరవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

➡️