డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న ఉషశ్రీ చరణ్
పెనుకొండ : రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ విమర్శించారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో నిర్వహించిన భారత రాజ్యాంగం దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందన్నారు. వైసిపి శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న గొంతులను సైతం నొక్కి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటం దారుణమన్నారు. జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మహిళలు గంజాయికి బానిసలయ్యారని మంత్రి సవిత శాసన మండలిలో వ్యాఖ్యానించడం దారుణమన్నారు. తన సొంత ఊరు రాంపురం వచ్చి ఎంత మంది మహిళలు గంజాయికి బానిసలు అయ్యారో నిరూపించాలని సవాల్ విసిరారు. అలా నిరూపించలేని పక్షంలో మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న టిడిపి సోషల్ మీడియా సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెనుకొండ డీఎస్పీ వేంకటేశ్వర్లుకు ఈసందర్భంగా ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వాల్మీకి కార్పోరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.