తపాలా నియామకాల్లో గోల్‌మాల్‌..!

తపాలా శాఖ ఎస్‌పికి వినతిని ఇస్తున్న బాధితురాలు నిర్మల

ప్రజాశక్తి-హిందూపురం

తపాలా శాఖ 2013లో చేపట్టిన నియామకాల్లో గోల్‌ మాల్‌ జరిగింది. నాడు జిడిఎస్‌ ఎంసి/ ఎండి భర్తీలో అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. న్యాయం చేయాలంటూ నాటి నుంచి నేటి వరకు ఓ బాధితురాలు తపాలా శాఖ అధికారులకు వినతులను అందిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం సైతం బాధితురాలు సి.నిర్మల తపాలా శాఖ ఎస్‌పి.విజరు కుమార్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని వినతిని అందించింది. ఈ విషయంపై బాధితురాలు మాట్లాడుతూ 2008 నుంచి 2019 వరకు తపాలా శాఖలో తాను అవుటోసోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నానని తెలిపింది. 2013-14లో జిడిఎస్‌ ఎంసి/ ఎండి నియామకాలు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా చేపట్టారన్నారు. ఆ సమయంలో ఓబీసీకి కేటాయించిన పోస్టును ఓసి కులానికి చెందిన వెంకటేష్‌ కు నియామకం చేశారన్నారు. రిజర్వేషన్‌ ప్రకారంగా నియామకాలు జరిగి ఉంటే పదవ తరగతిలో 350 మార్కులు సాధించిన తనకే ఉద్యోగం వచ్చేదని, ఓబీసీ పోస్టును వెంకటేష్‌ తప్పుడు సర్టిఫికెట్లను సష్టించి తనకు రాకుండా చేశారన్నారు. ఈ విషయంపై అన్ని ఆధారాలతో 2020 నుంచి ఇప్పటి వరకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై తాను గట్టిగా మాట్లాడినందుకు తపాలా శాఖ ఉన్నతాధికారులు ఉన్న ఉద్యోగం నుంచి సైతం తీసేశారని బోరున విలపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయంగా తనకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇప్పించాలని తపాలా శాఖ ఎస్‌పి విజరు కుమార్‌ను కోరింది. ఈ విషయంపై తపాలా శాఖ ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, పరిశీలన చేసి ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

➡️