కాంగ్రెస్‌తోనే సుపరిపాలన సాధ్యం

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మధుసూదన్‌ రెడ్డి

          పుట్టపర్తి అర్బన్‌ : దేశం, రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని పుట్టపర్తి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సాయి మా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉంటూ వైఎస్‌ అభిమానిగా ఉన్నాయని తెలియజేశారు. ఆ తరువాత వైసిపిలో చేరానని, ఆ పార్టీలో ఇమడ లేక బయటకి వచ్చానని తెలియజేశారు. జగన్‌ కేసులకు భయపడి మోడీ వద్ద సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన ప్రయోజనాలు సాధించడంలో జగన్మోహన్‌ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యాడన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వచ్చిన వైఎస్‌ షర్మిల నాయకత్వాన్ని గుర్తించి తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, విప్‌గా పనిచేసిన పల్లె రఘునాథ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివద్ధి చేయలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి 193 చెరువులకు నీరు ఇస్తామని ప్రగల్బాలు పలికి ఎన్నికల ముందు తూతూమంత్రంగా భూమిపూజ చేసి జిమ్మిక్కులు చేశారన్నారు. జగన్‌కు ప్రజాధరణ ఉంటే సిద్ధం సభలకు వందల కోట్లు ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పిన జగన్‌ ప్రాణాంతకరమైన నాసిరకం మద్యాన్ని తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందన్నారు. ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం అందిస్తామన్నారు. రైతులకు రూ.రెండు లక్షల పంట రుణం మాఫీ చేస్తామన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కోటా సత్యం, నల్లమాడ గౌస్‌ బాషా, పట్టణ కన్వీనర్‌ పుట్ల గంగాద్రి, లక్ష్మీనారాయణ, వాసుదేవ రెడ్డి, శ్రీధర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️