విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి సవిత
ప్రజాశక్తి -పెనుకొండ
విశిష్టమైన భారతీయ సంస్కతి, వారసత్వానికి ప్రత్యక్ష నిదర్శనాలు చేనేత సోయగాలు అని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. మంగళవారం నాడు గుంటూరులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా సోమవారం పెనుకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారత దేశ వారసత్వ సంపదలో భాగంగా చేనేత ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు జాతీయ చేనేత దినోత్సవం ముఖ్య ఉద్ధేశం అన్నారు. చేనేతకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా సహకార సంఘాల ఉత్పత్తి, అమ్మకాలను మెరుగు పరచి వాటిని బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను గుంటూరులో మంగళవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. చేనేత వస్త్ర ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 80 చేనేత సంఘాలు, సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. నూలు, పట్టు చీరలు, పావడాలు, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్, కలంకారి మొదలగు చేనేత ఉత్పత్తులు అమ్మకాలు ఇందులో ఉంటాయన్నారు. చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. యువ చేనేత కార్మికులకు కొత్త కొత్త డిజైన్ల రూపకల్పనపై శిక్షణ ఇస్తామన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నామని తెలియజేశారు. విజయవాడలో గాంధీ బునకర్ పేరుతో చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. రూ.2 కోట్లకు పైగా విలువజేసే చేనేత వస్త్రాలను ఎగ్జిబిషన్ ద్వారా విక్రయాలు జరిగాయన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామని చెప్పారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.