హంద్రీనీవా మొదటి దశ వెడల్పు తగ్గించి.. రెండో దశ లైనింగ్‌ ..!

హంద్రీనీవా కాలువ

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

హంద్రీనీవా మొదటి దశ కాలువ ప్రవాహ సామర్త్యాన్ని 6300 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు తగ్గించే యోచనలో ప్రభుత్వముంది. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల సమావేశంలోనే దీనిని వెల్లడించారు. వరదల సమయంలో హంద్రీనీవా ద్వారా అదనంగా నీరు తీసుకోవాలన్న యోచనలో కాస్త వెనక్కు తగ్గినట్టైంది. రెండో దశ లైనింగ్‌ పనులను చేపట్టాలని నిర్ణయించడమే కాకుండా పనులకు నిధులు మంజూరు చేస్తూ మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలువ సామర్థ్యం పెంచకుండా లైనింగ్‌ చేపడితే అదనంగా చేకూరే ఉపయోగమేమీ లేదనే భావన విపక్షాలు, రైతుల నుంచి వ్యక్తం అవుతోంది.

మొదటి దశ ప్రవాహ సామర్థ్యం కుదింపు

       హంద్రీనీవా మొదటి దశ అంటే శ్రీశైలం డ్యామ్‌ మల్యాల వద్ద నుంచి జీడిపల్లి వరకు వస్తుంది. అక్కడి నుంచి దిగువకు గొల్లపల్లి, కదిరి మీదుగా కుప్పం వరకు రెండో దశ 40 టిఎంసిల నీటిని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 2012లో ఈ ప్రాజెక్టు మొదటి దశకు నీళ్లు ఇచ్చారు. అప్పటి నుంచి ఏటా హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీరొస్తోంది. ఇప్పుడున్న కాలువ ప్రవాహ సామర్థ్యం 2800 క్యూసెక్కులు. ఈ ప్రవాహ సామర్థ్యంతో మూడు జిల్లాలకు సాగు, తాగునీటిని పూర్తి స్థాయిలో అందివ్వడం సాధ్యం కాదని పది వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో హంద్రీనీవా కాలువ ప్రవాహ సామ ర్థ్యం ఏర్పాటు చేయా లని డిమాండ్‌ వచ్చింది. వరదలొచ్చి వృథాగా నీరు దిగువకు పోతున్న సమయంలో రోజుకు ఒక టిఎంసి చొప్పునైనా నీరు ఈ కరువు ప్రాంతానికి అందించి నిలువ ఉంచుకుంటే ప్రయోజనమని ఈ డిమాండ్‌ను తీసుకొచ్చారు. ఇప్పుడున్న కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు పెంచుతూ 2021 వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు టెండర్లు కూడా ఆహ్వానించింది. ఇదే కాలువకు సమాంతరంగా మరో నాలుగు వేల క్యూసెక్కులతో రెండో దపాలో ఒక కాలువను తీసుకొస్తామని కూడా గతంలో ప్రకటించింది. ఈ పనులు టెండర్‌ దశలోనే ఆగిపోయాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవాహ సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కలు కాకుండా 3850 క్యూసెక్కులతోనే తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పుడున్న 12 పంపులతో దీన్ని అదే విధంగా నడుపవచ్చునని బావిస్తోంది. దీనిపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

రెండో దశ లైనింగ్‌

          మొదట దశపై తర్జభర్జనలు నడుస్తున్న క్రమంలోనే రెండో దశ లైనింగ్‌కు ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులిచ్చింది. 216వ కిలోమీటరు నుంచి 400 కిలోమీటరు వరకు 12 భాగాలకు పనులను విడగొట్టి లైనింగ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.936.70 కోట్లు కేటాయించింది. ఇప్పుడున్న కాలువలో నీరు చివరి వరకు వెల్లడం ఇబ్బందికరంగా ఉందని భావించి నీటి వేగాన్ని పెంచేందుకుగానూ ఈ లైనింగ్‌ను చేపడుతోంది. తద్వారా జీడిపల్లి నుంచి చివరనున్న కుప్పం వరకు నీటిని అందించవచ్చన్న యోచనలో ప్రభుత్వమున్నట్టు తెలుస్తోంది.

వెడల్పు లేకుండా లైనింగ్‌ పనులతో ప్రయోజనం లేదు

వి.రాంభూపాల్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి.

        కాలువను వెడల్పు చేపడతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పనులు చేపట్టాలి. అలా కాకుండా కేవలం లైనింగ్‌ మాత్రమే చేపడితే ప్రయోజనం లేదు. ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పనులు చేసినట్టు ఉంటుంది. ఈ ఏడాది శ్రీశైలం డ్యామ్‌ పొంగిపొర్లినా అనంతపురం జిల్లాకు అదనంగా నీరు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణం కాలువ ప్రవాహ సామర్థ్యం లేకపోవడమే. ఈ కాలువ సామర్థ్యం పెంచకుండా లైనింగ్‌ చేపడితే అదనంగా చేకూరే ఉపయోగమేమీలేదు. కావున ప్రభుత్వం పునరాలోచించి మొదటి విడత కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి.

➡️