వ్యక్తిగత వినతిపత్రాలను చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, పేదలు
ప్రజాశక్తి – పుట్టపర్తి రూరల్
పుట్టపర్తి మున్సిపాలిటీ, మండల పరిధిలోనీ గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలను ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్‌కు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు చెందిన వ్యక్తిగత అర్జీలతో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి సాకే వెంకటేష్ అధ్యక్షతన తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు , పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీ మేరకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మహిళా కార్మిక సంఘం జిల్లా నాయకులు స్వర్ణలత , రమాదేవి , ప్రమీల , శోభ తదితరులు పాల్గొన్నారు.