అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ టిఎస్.చేతన్
పుట్టపర్తి అర్బన్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమిస్తే ఆయా విభాగల్లో ప్రగతిని సాధించగలం అని కలెక్టర్ టిఎస్.చేతన్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్‌ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌అభిషేక్ కుమార్, డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్య రేఖ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి 265 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పనిచేద్దాం – లక్ష్యాలు సాధిద్దాం అన్న నినాదంతో ముందుకెళ్లాలన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు వారానికి ఒకరోజు శుక్రవారం నాడు సచివాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు, రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రులను తనిఖీలు చేయాలన్నారు. అక్కడ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అధికారులు కషి చేయాలని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి10-30 గంటల మధ్య నెవల చివరి శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. వారివారి శాఖల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో 24 గంటల కాల్ సెంటర్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ వెంకటరమణతో పాటు జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.