అవినీతి ఆరోపణలపై గుట్టుగా విచారణ

Feb 12,2025 22:09 #against corruption, #hindupuram

కార్యాలయం గది బయట వేచి ఉన్న అధికారులు

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం వాణిజ్య పనుల శాఖ కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై జేసీ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన విచారణ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణవేణి భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో కొంతమంది డీలర్లుఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ సూచనల మేరకు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ శేషాద్రి విచారణ అధికారిగా డిప్యూటీ కమిషనర్‌ మురళి మనోహర్‌ ను నియమించారు. దీంతో ఆయన బుధవారం విచారణ నిమిత్తం హిందూపురం వచ్చారు. అయితే ఈ విషయాన్ని స్థానిక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సమాచారం తెలియడంతో మీడియా ప్రతినిధులు కార్యాలయానికి వెళ్లి అసిస్టెంట్‌ కమిషనర్‌ ను కలిసి విచారణ అధికారి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన రాలేదని తెలిపారు. కాని విచారణ అధికారి ఉదయం నుంచి ఫిర్యాదులు చేసిన వారిని రహస్యంగా కలిసినట్లు తెలిసింది. మధ్యాహ్నం విచారణ అధికారి కార్యాలయనికి వచ్చిన విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అయన్ను కలవడానికి కార్యాలయానికి వెళ్లారు. విచారణ అధికారి మురళి మనోహర్‌ మూడు నిమిషాలు మాట్లాడడానికి రెండు గంటలసేపు సమయం పట్టింది. అధికారులతో రహస్యంగా రెండు గంటలసేపు చర్చించారు. అనంతరం మీడియా ప్రతినిధులను లోపలికి పిలిచారు. కార్యాలయంలో ఎటువంటి అవినీతి జరగలేదదనిఫిర్యాదులు చేసిన డీలర్ల చిరునామాకు వెళ్లి పరిశీలిస్తే అక్కడ వారు ఎవరూ లేరని, నిరాధారణ ఆరోపణలని కొట్టి పారేశారు. అయినప్పటికీ కార్యాలయంలో ఉన్న అధికారులను ఒక్కొక్కరిగా విచారణ చేస్తున్నామని, మరి కొంతమందిని అనంతపురం పిలిపించి విచారణ చేస్తామని తెలిపారు. అయితే ఎటువంటి అవినీతి జరగకపోతే గంటల తరబడి రహస్యంగా అధికారులను విచారణ చేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిని కప్పిపుచ్చడానికి విచారణ అధికారి ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

➡️