అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు

Nov 27,2024 21:46

అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

                     పుట్టపర్తి రూరల్‌ : జిల్లాలోని గోరంట్ల, సోమందేపల్లి, కదిరి ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డ ముగ్గురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.7 .68 లక్షల నగదు, 84 గ్రాముల బంగారు ఆభరణాలు,2.173 కేజీల వెండి, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు.పుట్టపర్తి డీఎస్పీ విజరు కుమార్‌, పుట్టపర్తి రూరల్‌ సిఐ సురేష్‌, ఎస్‌ఐ లింగన్న, సిఐ శివ అంజినేయులు, ఎస్‌ఐ రామచంద్ర ఆధ్వర్యములో అనంతపురం టౌన్‌ కు చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు వివరించారు. నిందతులు షికారు కోటయ్య, షికారు శ్యాం, షికారు అర్జున్‌ను చెడు వ్యసనాలకు బానిసలై అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య , కడప జిల్లాలలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లారన్నారు. జైలు నుంచి విడుదల అయిన వారు ఒక ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్ళను టార్గెట్‌ చేసుకొని పుట్టపర్తి రూరల్‌, సోమందేపల్లి , గోరంట్ల మరియు కదిరి పోలీసు స్టేషన్ల పరిధిలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశారన్నారు. వీరిపై వివిధ పోలీస్‌ స్టేషన్లో కేసులు నమోదయ్యాయన్నారు. వీరిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పుట్టపర్తి డి.ఎస్‌.పి విజరు కుమార్‌ , ఎస్బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, పుట్టపర్తి రూరల్‌ సిఐ సురేష్‌ , ఎస్‌ఐ లింగన్నను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ అర్ల శ్రీనివాసులు, పుట్టపర్తి డీఎస్పీ విజరు కుమార్‌, ఎస్‌బి సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి , పుట్టపర్తి రూరల్‌ సీఐ సురేష్‌, ఎస్‌ఐ లింగన్న, ఎస్‌బి ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️