కదులుతున్న కదిరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కుర్చీ..?

బెంగుళూరులోని ఓ హోటల్‌లో కదిరి వైసిపి కౌన్సిలర్లు

        కదిరి అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించింది. ఇదే ఊపులో కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంటకప్రసాద్‌ టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఆ ప్రభావం పురపాలికలపై పడుతోంది. ఈ క్రమంలో కదిరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కూర్చీ కదులుతోందనే వాదనలు బలంగా విన్పిస్తోంది. ఇటీవల వైసిపి కౌన్సిలర్లు క్యాంపు రాజకీయాలకు వెళ్లడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. వైసిపి కౌన్సిలర్లకు తాజాగా ఆ పార్టీ ముఖ్య నేతలు విందు సమావేశం ఏర్పాటు చేయడంపై పలు గుసగుసలు విన్పిస్తున్నాయి. సోమవారం నాడు కదిరి వైసీపీ నాయకులు కర్నాటకకు క్యాంప్‌కు వెళ్లారు. దీనిపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడంతో వైసిపి కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం నడుస్తోంది. ఇలా జరగకుండా వైసీపీ ముఖ్య నాయకులు క్యాంపు రాజకీయాలకు తెర లేపారనే ప్రచారం ఉంది. వైసిపి నాయకులు మాత్రం ఇది కేవలం విహారయాత్ర మాత్రమేనంటూ కొట్టిపారేస్తున్నారు. కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లిన సమయంలో మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ గదికి తాళాలు వేశారు. వైసీపీ అభ్యర్థి వద్దకు ఆపార్టీ కౌన్సిలర్లను తీసుకెళ్లి తామంతా ఐక్యమత్యంగా ఉండి కదిరిలో వైసిపికి పూర్వ వైభవం తీసుకొస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా జరిగినట్లు సమాచారం. కాగా ఓటమి తర్వాత వైసిపి అభ్యర్థి కదిరి నుంచి దూరంగా వెళ్లడంపైనా కొందరు కౌన్సిలర్లు, నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటమిని సవాల్‌గా తీసుకుని ముందుకుసాగి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని చెబుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సమయంలో కదిరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మార్పుపై వస్తున్న ఊహాగానాలు రాజకీయాంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

➡️