ధర్మవరం మున్సిపల్ కార్యాలయం
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి
ధర్మవరంలో తెలుగుదేశం, బిజెపి కూటమి మధ్య గత కొంతకాలంగా కుంపటి రగులుతోంది. ప్రారంభం నుంచి టిడిపి, బిజెపిల మధ్య ఈ ఆదిపత్యపు పోరు నడుస్తూనే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అనూహ్యంగా బిజెపి అభ్యర్థిగా సత్యకుమార్ ఇక్కడికి విచ్చేశారు. అంతకు మునుపు వరకు ఆయన కడప జిల్లాకు చెందిన వారిగా ఉంటూ వచ్చారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో వచ్చినప్పటికీ టిడిపి సహకారంతో ఇక్కడ బిజెపి విజయం సాధించింది. అంతకు మునుపు వరకు బిజెపికి మాజీ ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ ఉండేవారు. ఇటు టిడిపికి పరిటాల శ్రీరామ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికల్లో గోనుగుంట్ల సూర్యనారాయణకు బిజెపి టిక్కెట్టు ఖరారు అని ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో ఆయనకు కాకుండా సత్యకుమార్ తెరపైకి వచ్చాడు. సూర్యనారాయణతో ముందు నుంచి ఉన్న విభేదాల నేపథ్యంలో శ్రీరామ్ సత్యకుమార్‌కు గత ఎన్నికల్లో మద్దతు పలికారు. ఆయన తరుపున ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సత్యకుమార్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకున్న టిడిపికి, కొత్తగా అధికారంలోకి వచ్చిన బిజెపికి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. సత్యకుమార్ మంత్రి అయ్యి నియోజకవర్గానికి వచ్చిన సమయంలో తొలి సమావేశంలోనే టిడిపి, బిజెపి నాయకులు ఘర్షణ పడ్డారు. ఆ తరువాత బత్తలపల్లిలోనూ ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బదిలీ వ్యవహారం టిడిపి, బిజెపి మధ్య పెద్ద ఘర్షణనే రాజేసింది. ఏకంగా టిడిపి శ్రేణులు శనివారం నాడు మంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గత వైసిపి పాలనలో మల్లికార్జున టిడిపి నాయకులకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా ఏ మాత్రం విలువనివ్వలేదని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ ఇక్కడికే తీసుకురావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ తక్షణం మల్లికార్జునను బదిలీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు సత్యకుమార్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఉద్యోగులతో పనిచేయించుకోవాలిగానీ బదిలీలు చేయడం సరైంది కాదని అంటున్నారు. దీంతో ఆయన్ను బదిలీ చేసే వరకు వదిలేది లేదని టిడిపి నాయకులు నిరసనలకు దిగుతున్నారు. ఒకానొక దశలో అటు టిడిపి, బిజెపిల మధ్య మాటాల యుద్దమే కాకుండా ప్రత్యక్ష దాడులు కూడా జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇది ఎంత వరకు వెలుతుందోనని కూటమి నేతల్లో గుబులు రేపుతోంది. ఇదే కాకుండా ఇతర పనుల విషయంలోనూ టిడిపి, బిజెపి నేతల మధ్య పరస్పరం పోరు నడుస్తోంది. నియోజకవర్గంలో తమ పట్టును నిలుపుకునేందుకు టిడిపి నేతలు ఒకవైపు ప్రయత్నిస్తుండగా, తమ బలాన్ని పెంచుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కుంపట రాజుకుంది. ఇది ఇంకా ఎంత దూరం వెలుతుందో చూడాల్సి ఉంది. రెండు పార్టీల అధిష్టాలు దీనిపై ఇప్పటికీ పెదవి విప్పలేదు. మౌనంగా వీక్షిస్తుండటం గమనార్హం.