కుల వివక్షపై చర్యలు తీసుకోవాలి : కెవిపిఎస్‌

Feb 5,2025 21:40

గ్రామ దళితులతో కెవిపిఎస్‌ నాయకులు

                       మడకశిర : రొళ్ల మండలం మల్లినమడుగు గ్రామంలో కొనసాగుతున్న కుల వివక్షపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, అధ్యక్షులు అన్నమయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు బుధవారం మల్లినమడుగు గ్రామంలో దళితులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కులవివక్ష కొనసాగుతుండటం దారుణమన్నారు. అంటరానితనం నిర్మూలించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఓటు బ్యాంకు కోసం దళితులను వాడుకోవడం తప్ప వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏప్రిల్‌ 14వ తేదీన, డిసెంబర్‌ 6వ తేదీన అంబేద్కర్‌ విగ్రహానికి వంద రూపాయలు ఖర్చుపెట్టి పూల హారం వేసి అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగిస్తామని వాగ్దానాలు చేయడం తప్ప అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చిందని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లినమడుగు గ్రామంలో ఇంటింటికి చదువుకున్న యువకులున్నారని అయినప్పటికీ గ్రామంలో చెప్పలేనంత వివక్ష కొనసాగుతోందని అన్నారు. స్థానిక తహశీల్దార్‌, ఎస్‌ఐ 105 జీవోను అమలు చేయడం లేదన్నారు. వీరు చట్టాలపై అవగాహన కల్పించి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. తమ గ్రామంలో వివక్ష ఉందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఎస్‌ఐగాని, తహశీల్దార్‌గాని గ్రామాన్ని సందర్శించలేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే కులవ్య వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరిగిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ కన్వీనర్‌ బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు , మురళి, పరమేష్‌ సురేష్‌ , రంగనాథప్ప రాజన్న , భూతరాజు, రంగనాధ్‌ , చంద్రప్ప , రెడ్డప్ప, ఎన్‌ తిప్పాయి స్వామి, నరసింహయ్య కదిరప్ప ,రంగప్ప, తదితరులు పాల్గొన్నారు.

➡️