సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
కార్మికులను శ్రమ దోపిడీ గురిచేసి బానిసత్వాన్ని పేరేపించేలా ఉన్న లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకునేంత వరకూ ఐక్యంగా పోరాడుదామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని హెచ్‌ఎల్‌సి కాలనీలో ఉన్న మెడికల్ హాల్‌లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.నాగమణి అధ్యక్షతన జిల్లాస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్, ప్రయివేటీకరణ విధానాలు అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. అదానీకి దేశంలోని ఓడరేవు లు, ఉక్కు పరిశ్రమలు, పవర్ ప్రాజెక్టులు అప్పగించి లక్షల కోట్లు దోచిపెడుతోందన్నారు. వాటి ఫలితంగా ప్రజలపై విద్యుత్ భారాలు సర్‌ఛార్జిలు, సర్వీస్ ఛార్జీలు పేర్లతో ప్రజల నుంచి వందల కోట్లు దోచుకు ంటున్నారని ఆరోపించారు. విద్యుత్ వినియోగంపై మీటర్లను బిగించి రీఛార్జి చేసుకుని విద్యుత్ వినియోగించే దగల్‌బాజీ విధానాలను తీసుకొస్తోంద న్నారు. మోదీ అదానీకి దోచిపెడుతుంటే టిడిపి కూడమి ప్రభుత్వం ఏమి తెలియనట్లు నటిస్తోందన్నారు. నాడు జగన్ ప్రభుత్వంపై గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్‌లు నేడు మోదీకి మోకరిల్లుతున్నారని తెలిపారు. కార్పొరేట్, ప్రయివేటీకరణ విధానాలు అమలు చేయడంలో జగన్, చంద్రబాబు, పవన్, మోదీ అందరూ ఒక్కటే అన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు, తాగునీటి సరఫరా కార్మికులు, ఆశాలకు సకాలంలో వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీలు, ఉక్కు పరిశ్రమలు, వందలాది ఎకరాల భూములు కట్టపెడుతున్నారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే పరిశ్రమలను తెస్తు ఏదో అద్భుతం చేస్తామన్నట్ల మభ్యపెడుతున్నారని విమర్శించారు. విశాఖ పర్యటనలో మిట్టల్ ఉక్కు పరిశ్రమ తీసుకొచ్చి పరిశ్రమ ఆరంభం కాకమునుపే ఆరు నెలల వేతనాలు ఇస్తారంటూ ప్రధాని గొప్పలు చెప్పారని, లక్షల కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కట్టి, ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఎంత మోసమో అర్థమోతోందన్నారు. మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో లేబర్‌కోడ్‌లు అమలులోకి వస్తే కార్మికులు వెట్టి చాకిరి, శ్రమ దోపిడీ, బానిసత్వానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. నయా ఉదార వాద విధానాలను తిప్పి కొట్టేందుకు కార్మిక వర్గాన్ని చైతన్యం పరిచి ఐక్య పోరాటాలు చేస్తే పాలక ప్రభుత్వాలు వెనుకంజ వేస్తాయని తెలిపారు. సిఐటియుగా కార్మికుల పక్షపాతిగా ముందుండి పోరాడుతుందన్నారు. అన్ని వర్గాల కార్మికులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హక్కులు సాధించుకోవడానికి పోరాటాలే మార్గం అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మన్ని రామాంజనేయులు, జిల్లా కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, మల్లికార్జున, అచ్యుత్, ఎటిఎం.నాగరాజు, ఎన్టీఆర్ శ్రీనివాసులు, మండల నాయకులు నాగేంద్ర, సురేంద్ర, ఆజాం, ఆది, లక్ష్మీనరసమ్మ, కుళ్లాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.