ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం : యుటిఎఫ్‌

Jun 9,2024 21:30

సమావేశంలో పాల్గొన్న నాయకులు

                     కొత్తచెరువురూరల్‌ : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేష్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ పిలుపునిచ్చారు. కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా యుటిఎఫ్‌ మద్యంతర కౌన్సిల్‌ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలన్నారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, 117 జీవో, 3, 4, 5 తరగతుల విలీనం జీవోలను వెంటనే రద్దు చేయాలన్నారు. 1998, 2008 ఉపాధ్యాయులను రెగ్యులైజేషన్‌ చేయాలన్నారు. సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన యాప్‌లను రద్దు చేయాలన్నారు. నూతనంగా ఏర్పడుతున్న ప్రభుత్వం తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు. యుటిఎఫ్‌ను జిల్లావ్యాప్తంగా బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు బూతన్న, ఉపాధ్యక్షులు బాబు, కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, తాహిర్‌వలి, వైవి.సుబ్బారెడ్డి, అనిల్‌కుమార్‌, రామకృష్ణనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️