బాల్య వివాహాలను అరికడదాం

Jun 11,2024 22:04

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీవో వెంకట శివరామిరెడ్డి

                  ధర్మవరం టౌన్‌ : బాల్య వివాహాలను అరికట్టడాన్ని ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి సూచించారు. పట్టణంలోని ఆర్డీవో సమావేశ భవనంలో ధర్మవరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల్య వివాహాల నియమ నిబంధనలు, బాలలపై లైంగిక దాడుల నిరోధక చట్టంపైన ఒక్కరోజు అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, సీడీపీవో లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు నిలుపుదల చేయడానికి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులను నియమించారన్నారు. ఒక అమ్మాయి చదువు ఇంటికి వెలుగునిస్తుందన్నారు. బాలికల హక్కులను కాపాడాలని బాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. బాలలపై లైంగిక దాడులు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు నిరోధక చట్టంలోని అంశాలను ఈసందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో మహేష్‌, పరిరక్షణ అధికారులు నాగలక్ష్మి, మురళీధర్‌, శాంతి, కౌసల్య, ఐసీడీఎస్‌ సూపర్వైజర్లు, సచివాలయాల అడ్మిన్లు, వార్డు వీఆర్వోలు, మహిళా పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

➡️