స్థానిక చరిత్రలు రికార్డు చేయాలి

Jun 9,2024 21:32

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు

                    అనంతపురం : నొళంబుల చరిత్రను రికార్డు చేయడం సిద్ధగిరి శ్రీనివాస్‌ చేసిన సాహసోపేతమైన ప్రయత్నమని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బండి నారాయణస్వామి అన్నారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో నిర్వహించిన ”నొళంబ వాడి” పుస్తకపరిచయసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతపురం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిచయ సభకు ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్‌. జెన్నే ఆనంద్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా బండి నారాయణస్వామి మాట్లాడుతూ మడకశిర ప్రాంతానికి చెందిన రచయిత సిద్ధగిరి శ్రీనివాస్‌ తన స్థానిక చరిత్రను రికార్డు చేయాలన్న ఒక తలంపులో నుంచి ఈగొప్ప చరిత్ర రచన పుట్టుకు వచ్చిందని, అది చరిత్రకు కొత్త చేర్పు అయిందని అన్నారు. చరిత్ర అధ్యయనం నానాటికి కుంటుపడుతోందని ప్రతి ఒక్కరూ చరిత్ర అధ్యయనంపై దృష్టి సారించాలని అన్నారు. సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్‌బాషా మాట్లాడుతూ సిద్ధగిరి శ్రీనివాసుల సునిశితమైన పరిశీలన జ్ఞానమే ఈ పుస్తక రూపకల్పనకు దారితీసిందని, ఇలాంటి మరెన్నో పుస్తకాల రూపకల్పనకు ఆయన శ్రీకారం చుట్టాలని అన్నారు. ‘ఫర్‌ ద సొసైటీ చారిటబుల్‌ ట్రస్ట్‌’ వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల రాధాకృష్ణ మాట్లాడుతూ కవులు తమ రచనలతో ఈ సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నారని, యువత ఈ రచనల అధ్యయనం వైపు దృష్టి సారించాలని అన్నారు. ‘అనంత విద్యావంతుల వేదిక’ అధ్యక్షులు బండి నాగరాజు మాట్లాడుతూ మరుగున పడిన చరిత్రను వెలుగుపరిచిన సిద్ధగిరి శ్రీనివాస్‌ ఆదర్శనీయుడన్నారు. శేషగిరి రాయుడు మాట్లాడుతూ కాషాయీకరణలో భాగంగా నేడు చరిత్ర అంతా వక్రీకరించబడుతోందని నిక్కచ్చిగా చరిత్రను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని, ఆ పని ఇటీవల కాలంలో సిద్ధగిరి శ్రీనివాస్‌ చేయగలిగారని అన్నారు. డాక్టర్‌ అంకె శ్రీనివాస్‌ పుస్తకాన్ని సమీక్ష చేస్తూ సిద్ధగిరి ఈ పుస్తక రూపకల్పనలో పడిన కష్టాన్ని, శ్రమని, ఆయన వెచ్చించిన సమయాన్ని, ఓర్పును వెలకట్టలేమని అన్నారు. ఈ పుస్తకం స్థానిక చరిత్రల రూపకల్పనలో మిగతా ప్రాంతాల ఔత్సాహిక రచయితలకు ఒక ప్రోత్సాహంగా నిలబడుతుందని అన్నారు. రచయిత సిద్దిగిరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతపు చరిత్ర ఆనవాళ్ళను వెతుకుతున్న క్రమంలో రాసుకున్న పుట్‌ నోట్సే ఈ పుస్తకమని అన్నారు. ఈసందర్భంగా అతిథుల చేతుల మీదుగా రచయితను సన్మానించారు.ఈ కార్యక్రమంలో లలిత కళా పరిషత్‌ అధ్యక్షులు గాజుల వెంకటసుబ్బయ్య, జిల్లా రచయితల సంఘం గౌరవ సలహాదారులు కంబదూరి షేక్‌ నబీరసూల్‌, మధుర శ్రీ, కొత్తపల్లి సురేష్‌, కోటిగారి వన్నప్ప, తరిమెల అమర్నాథ్‌ రెడ్డి, గోవిందరాజులు, చేగువేరా హరి, జీ.విశ్వనాథ్‌ రెడ్డి, వలస రమేష్‌, తలారి రామాంజనేయులు, అడ్వకేట్‌ చంద్రాచెర్ల హరి, జూటూరు షరీఫ్‌, షేక్‌ రియాజుద్దీన్‌, అలీ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️