మిలాఖత్‌ అవుదామా…వెనక్కు తగ్గుదామా..!

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

        మద్యం దుకాణాల టెండరు దాఖలుకు సమయం బుధవారంతో ముగియనుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు పద్ధతుల్లోనూ టెండరు స్వీకరణ జరుగుతోంది. రెండేళ్ల కాల వ్యవధితో ఇస్తున్న ఈ టెండరున్‌ దక్కించుకోవడానికి అనేక మంది వ్యాపారులు, రాజకీయ నాయకులు దృష్టి సారించారు. రాబోయే రెండేళ్ల కాలంలో జరగబోయే మద్యం వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు నేతలు కూడా సిద్ధమయ్యారు. 2019 ముందు వరకు ఇదే విధానం ఉండేది. 2019 అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీనిపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మద్యం విధానం మార్పు చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే దీనిపై దృష్టి సారించింది. కొత్త విధానాన్ని ప్రకటించడమే కాకుండా టెండర్లు ఆహ్వానించింది. గడిచిన ఐదేళ్లుగా మద్యం వ్యాపారం లేకపోవడంతో వ్యాపారులతోపాటు, రాజకీయ నాయకులకు ఆదాయం వనరు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ ఆదాయం మార్గం రావడంతో మద్యం టెండరును దక్కించుకునేందుకు ఉత్సాహం చూపారు. ప్రభుత్వం పెట్టిన రెండు లక్షల రుసుం భారంగానే ఉన్నప్పటికీ అదృష్టం పరీక్షించుకుందామని కొంత మంది ఆలోచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం ఇంత ఆదాయ వనరును వదులుకునేందుకు సిద్ధపడటం లేదు. ఎలాగైన తాము దక్కించుకోవాలని నేరుగానే రంగంలోకి దిగుతున్నారు. తమ అనుయాయుల ద్వారా దారఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ పరిధిలో తమ అనుమతి లేకుండా ఎవరూ వేయడానికి వీల్లేదని చెబుతుండటంతో టెండర్లపై ఆశలు పెట్టుకున్న వారిలో నిరాశే ఎదురవుతోంది. రెండు లక్షలు ముందుగా చెల్లించి తరువాత రాకపోయినా… ఒకవేళ వచ్చినా ప్రజాప్రతినిధులను ఎదురించి మద్యం దుకాణం నడపడం సాధ్యమవుతుందా అన్న సందేహాలతో చాలా మంది వెనక్కు తగ్గుతున్నారు. అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాలకు టెండర్లు పిలిస్తే 1272 మాత్రమే దాఖలవగా, సత్యసాయి జిల్లాలో 87కుగానూ 617 దాఖలయ్యాయి. బుధవారంతో టెండరు దాఖలు గడువు ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో ఉన్న వారు నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా, మరికొంత మంది గ్రూపుగా అయ్యి టెండరు వేయడానికి సిద్ధమవుతున్నారు. చివరి రోజు ఏ రకంగా దరఖాస్తులు రానున్నాయన్నది చూడాల్సి ఉంది. జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు మాత్రం టెండరు దాఖలుపైగా నిశితంగా దృష్టి సారించారు. తమకు తెలియకుండా ఎవరు వేస్తున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. ఒకట,రెండు నియోజకవర్గాల్లో ముఖ్య నేతలే తమ సమీప బంధవులు, అనుయాయుల ద్వారా ఇప్పటికే దరఖాస్తులు చేయించారు.

మరో మూడు రోజులు పొడిగించే అవకాశం..?

        మద్యం దుకాణాల టెండర్లకు స్పందన తక్కువగా ఉండటంతో ప్రభుత్వం మరో మూడు రోజులు పొడిగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అకవాశాలున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. ఇంకోవైపు నేతలు మాత్రం కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

➡️