రాష్ట్రంలో నాణ్యమైన మద్యం విక్రయాలు: మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజాశక్తి-గోరంట్ల

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ నాణ్యమైన మద్యం విక్రయాలు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గోరంట్ల మండలంలో పాలసముద్రం వద్ద రూ.1.25 కోట్లతో నిర్మించిన ఐఎంఎఫ్‌ఎల్‌ డిపో గోడౌన్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవితమ్మ, ఎమ్మెల్యేలు కందికుంట వెంకట ప్రసాద్‌, ఎమ్మెస్‌.రాజు, పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా 3500 మద్యం దుకాణాల కేటాయింపు చేపట్టామని తెలిపారు. మద్యం గోడౌన్‌ నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని ట్రాక్‌ చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని అరికట్టడం ద్వారా రాష్ట్రంలో 30 నుంచి 40 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులను అమలు చేస్తున్నామన్నారు. జగన్‌ పాలనలో కల్తీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 13 రకాల పరీక్షలు చేసిన తరవాతే మద్యం బాటిళ్లను షాపులకు తరలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 రూపాయల పింఛన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్లను ఇస్తున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని విక్రయించడం ద్వారా కొందరు మతిస్థిమితి కోల్పోగా మరికొందరు మరణించారన్నారు. కూటమి ప్రభుత్వం రూ.99కే నాణ్యమైన మద్యాన్ని విక్రయిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా బీసీ సంక్షేమానికి 48 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌ పూల నాగరాజు, రాష్ట్ర రెవెన్యూ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా, రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ శర్మ, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ అనసూయ దేవి, ఎక్సైజ్‌ డిసి నాగ మద్దయ్య, ఆర్డీవో సువర్ణ పాల్గొన్నారు.

➡️