సమావేశంలో పాల్గొన్న అసమ్మతి కౌన్సిలర్లు, తదితరులు
కదిరి టౌన్ : కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నీసాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తామందరం ఏకతాటిపై ఉన్నామని ఛైర్‌పర్సన్‌ను గద్దె దింపుతామని మున్సిపల్ కౌన్సిలర్ కిన్నెర కళ్యాణ్ కుమార్, కొలిమి జిలాన్ అన్నారు. గురువారం పట్టణంలోని రోడ్లు భవనాలు అతిథిగృహంలో అసమ్మతి కౌన్సిలర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నీసా సాదిక్ వ్యవహార శైలితో కదిరి పట్టణంలో నాలుగేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. తామేదో చేస్తామని అప్పట్లో వైసీపీకి పూర్తిస్థాయి మెజార్టీని ప్రజలు ఇస్తే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నాలుగేళ్లు ఏమి చేయలేకపోయామని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కదిరిలో ఛైర్‌పర్సన్‌కు, ఆమె బంధువులకు వైసీపీ సొంత కుటుంబ పార్టీ లాగా మారిందని విమర్శించారు. గతంలో అప్పటి ఎమ్మెల్యే సహకారంతో కనీసం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తిని ఛైర్‌పర్సన్‌ను చేశారని అయినప్పటికీ ఆ ప్రజా ప్రతినిధి మాటకు కట్టుబడి తామందరం ఆమెను ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నామని చెప్పారు. అప్పట్లో అప్పులు చేసి ఎన్నికల్లో గెలిస్తే కనీసం వైసీపీ పెద్దలు తమను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కదిరి మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. ఛైర్‌పర్సన్ నజీ మున్నీషా వారి కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై 28 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఈనెల 23న తేదీ ఖరారు చేశారని చెప్పారు. ఆరోజు ప్రవేశపెట్టబోయే అవిశ్వాస సమావేశానికి హాజరై నజీ మున్నీసాను గద్దె దింపుతామని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆద్వర్యంలో కదిరి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడే కూటమి ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఈ సమావేశంలో అసమ్మతి కౌన్సిలర్లు పాల్గొన్నారు.