ప్రజాశక్తి-పెనుకొండ టౌన్
నవ్యశ్రీ గుర్రం స్వారీలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. పట్టణంలోని షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ శిల్ప కుమార్తె నవ్యశ్రీ చిన్నప్పటి నుంచే ఉన్న మక్కువతో బెంగళూరులో గుర్రం స్వారీలో శిక్షణ పొందుతోంది. 2021 నుంచి జాతీయ స్థాయి గుర్రం స్వారీ పోటీల్లో పాల్గొంటూ ప్రతిభ కనబరుస్తోంది. ఏటా డిసెంబర్‌లో జరిగే పోటీల్లో నవ్యశ్రీ పాల్గొంటూ ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ రాణిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ సాధించి బెస్ట్ రైడర్ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే గతేడాది ఎఫ్‌ఈఐ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 5, 6 స్థానాలు సాధించింది. వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన నుంది. నవ్యశ్రీ మాట్లాడుతూ ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ పోటీల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. శిల్ప మాట్లాడుతూ తమ కుమార్తె నవ్యశ్రీ ఆశయ సాధనకు తమ వంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నా మని తెలిపారు. జాతీయ స్థాయి గుర్రం స్వారీలో మెడల్స్ సాధించి బెస్ట్ రైడర్ అవార్డు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆసియా స్థాయిలో పాల్గొని దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు.