పట్టణంలో ఎలాంటి అనుమతులు లేని ఓ రెస్టారెంట్
హిందూపురం : ఉమ్మడి అపంతపురం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో రెస్టారెంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. శ్రీ సత్య సాయి జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరి, పెనుకొండతో సహ మిగిలిన పట్టణాల్లో కల్తీ ఆహారం రాజ్యమేలుతుంది. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఒక్క హిందూపురంలోనే దాదాపు 20 రెస్టారెంట్లు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 5వేలకు పైగా రెస్టారెంట్లు ఉండగా వీటిలో అనుమతులు ఉండేవి వందల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్ట్రీట్ ఫుడ్స్ సెంటర్లు, భోజనం, టిఫిన్ హోటళ్లు అధిక సంఖ్యలో ఉన్నప్పటకీ వాటిలో కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరు పురపాలక సంఘంలో ట్రేడ్ లైసెన్స్ తీసుకుని ఇదే అనుమతి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ రెస్టారెంట్లలో నాణ్యత లేక పోయినప్పటికి అధిక ధరలతో పాటు కనీసం తాగునీరు కూడా ఇవ్వరు. తాగునీటినికొనాల్సిన దుస్థితి ఉంది. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, భోజన హోటళ్లుమితిమీరుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఆరోజుకు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి మరుసటి రోజు విక్రయించడం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఆహార విక్రయాలకు అనుమతులేవీ..? ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న పలు రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు అనుభవం లేని చెఫ్‌ను పెట్టుకొని ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాల విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లు, పలు దుకాణాలకు, ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యతలేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి క్యాష్ చేసుకుంటున్నారు. పట్టణాలతో పాటు రహదారుల్లో దాబాలు, రెస్టారెంట్లు, భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంటే వీటిపై సంబందిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార విక్రయ కేంద్రాలకు నిబంధనలు ఇవే.. ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్లకు, భోజన హోటళ్లకు, దాబాలకు, కర్రీ పాయింట్లకు రిజిస్ట్రేషన్ తో పాటు, ఆహార భద్రత అధికారి జారీ చేసిన లైసెన్స్ ఉండాలి. అధికారులు తమ దాడుల్లో ఆహార విక్రయ కేంద్రాల్లో అనుమతులు లేకపోతే ముందుగా నోటీసులను జారీ చేయాలి. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఆ కేంద్రాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. అంతేకాకుండా ఏడాదికొకసారి నిర్ణీత సంఖ్యలో నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించాలి. జిల్లాలోని ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలలో దీనికి భిన్నంగా కొనసాగుతుంటే అధికారులకు మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ కరువు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కల్తీ ఆహారం రాజ్యమేలుతోంది. నిల్వ ఉంచిన ఆహారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంపై దెబ్బతీస్తున్న విక్రయదారులపై అధికారుల చర్యలు శూన్యం అనిపిస్తుంది. కల్తీ ఆహారాలు విక్రయం జరగకుండా తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరిచడం వల్ల కల్తీ రాకెట్లు రెచ్చిపోతున్నాయి. ఆహార భద్రత అధికారులు ఒక్కొక్కరు వారి పరిధిలో నిర్ణీత సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యావసరాల్లో వాటి నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు నమూనాలను సేకరించాలి. సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపించి వచ్చిన ఫలితాలు ఆధారంగా విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఈ తీరు ఆచరణలో మాత్రం శూన్యం అనిపిస్తోంది. తూతూమంత్రపు దాడులతో మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి మండలానికి ఒక ఆహార భద్రత అధికారి ఉండి పర్యవేక్షణ చేస్తే ఫలితాలు ఉంటాయి. అయితే ఉమ్మడి జిల్లాలో మాత్రం సిబ్బంది కొరతతో ఆహార భద్రత అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రెండు జిల్లాలకు ఇద్దరు అధికారులు ఉండడం, వీరే నమూనాలు సేకరించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా పని భారం ఎక్కువ అవుతోంది.