దేవరాయ పాఠశాల యాజమాన్యానికి నోటీసులు

Jun 11,2024 22:09

బ్యానర్‌ తొలగిస్తున్న సిబ్బంది

                  చిలమత్తూరు : మండలకేంద్రంలో నిబంధనలు పాటించని దేవరాయ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ యాజమాన్యానికి విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ‘యథేచ్చగా ప్రయివేటు దోపిడీ’ అనే శీర్షిక ప్రజాశక్తి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథానానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. డివైఇఒ రంగస్వామి, ఎంఇఒ -1 పద్మప్రియ మంగళవారం స్థానిక దేవరాయ ప్రయివేటు పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ దేవరాయ పాఠశాలకు నర్సరీ నుండి 10 వరకు అనుమతులు లేవన్నారు. కేవలం 1 నుండి 7 వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉందని అన్నారు. అలాంటపుడు లేనిది ఉందని చెప్పి బ్యానర్లు పెట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈసందర్భంగా పాఠశాల యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్‌ నిర్వహణ ఎలా చేస్తారని యజమాన్యాన్ని ప్రశ్నించారు. నవోదయ, ఎపిఆర్‌ఎస్‌, కేరళ టీచర్లతో శిక్షణ వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చేయరాదన్నారు. వెంటనే ప్రకటన వేసిన బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. అయితే మంగళవారం సాయంత్రమైనా బ్యానర్లను తొలగించకపోవటంతో పంచాయతీ సిబ్బంది సహకారంతో బ్యానర్లను తొలిగించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి ప్రయివేటు పాఠశాలల మాయలో పడి మోసపోవద్దని సూచించారు. ఆ పాఠశాలలో ప్రీ ప్రైమరి అనగా నర్సరీ, ఎల్‌ కే జీ,యూకేజీలకు, అలాగే 8-10 వరకు అనుమతి లేదని ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని అన్నారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేసి విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.

➡️