స్థలం వివాదంతోనే ఎన్‌ఎస్‌యుఐ నేత హత్య

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

      ధర్మవరం టౌన్‌ : జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది సంపత్‌కుమార్‌ హత్య కేసును ధర్మవరం పోలీసులు చేధించారు. ఇందుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. స్థలం వివాదంలో నెలకొన్న ఘర్షణే హత్యకు కారణం అని పోలీసులు నిర్ధారించారు. హత్య, నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను మంగళవారం ధర్మవరం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులు సిఐ సుబ్రమణ్యంతో కలిసి విలేకరులకు వెల్లడించారు. ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కార్యదర్శి, యువ న్యాయవాది సంపత్‌ కుమార్‌ గత నెల 29వ తేదీన దారుణహత్యకు గురైయ్యాడు. ధర్మవరం చెరువు కట్ట కింద ఈయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. హిందూపురానికి చెందిన సంపత్‌కుమార్‌ ఎన్‌ఎస్‌ఎయుఐ జాతీయ నాయకునిగా, యువ న్యాయవాదిగా ఉన్నాడు. సంపత్‌ కుమార్‌ స్నేహితుడు శ్రీకాత్‌రెడ్డికి హిందూపురం పట్టణానికి చెందిన న్యాయవాది కృష్ణారెడ్డికి మధ్య ఓ స్థలం వివాదం నడుస్తోంది. ఇందులో స్నేహితునికి మద్దతుగా సంపత్‌కుమార్‌ నిలిచాడు. తన స్నేహితునికి స్థలం దక్కేలా పలు విధాలుగా పోరాటం చేశాడు. ఇందులో భాగంగా కృష్ణారెడ్డిపై పోలీసు స్టేషన్‌లో కేసు కూడా పెట్టాడు. ఈ సమస్య పెద్దది కావడంతో కృష్ణారెడ్డి సంపత్‌కుమార్‌ను అడ్డుతొలగించాలని భావించాడు. అందులో భాగంగా ఆయన్ను హత్య చేసేందుకు సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. గత నెల 26వ తేదీన హిందూపురం పట్టణం ముద్దిరెడ్డిపల్లికి చెందిన సెటిలెమెంట్‌ రామంజితోపాటు అతని అనుచరులు ధర్మవరం పట్టణం సిద్ధయ్యగుట్టకు చెందిన రంగం రవీంద్ర (ప్రస్తుతం హిందూపురంలో నివసిస్తున్నాడు), హిందూపురానికి చెందిన భుమా లోకేష్‌, కావలి శ్రీకాంత్‌, జంపుల శ్రీనివాసులు నాయుడుతో సంపత్‌కుమార్‌ను హత్య చేసేందుకు న్యాయవాది కష్ణారెడ్డి, అతని కుమారుడు నాగార్జునరెడ్డిలు రూ.55 లక్షలకు సుఫారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలను న్యాయవాది కష్ణారెడ్డి సెటిల్‌మెంట్‌ రామంజికి ఇచ్చాడు. ఈ క్రమంలో మే 29వ తేదీన రామంజి తన స్నేహితుడితో కదిరి వెళ్లేందుకు కారు కావాలని తీసుకున్నాడు. ఆ కారులో హిందూపురానికి వచ్చి సంపత్‌కుమార్‌ కలిశారు. రామాంజి అతని అనుచరులు శ్రీనివాసులు, రవీంద్ర, లోకేష్‌, శ్రీకాంత్‌లు 29వ తేదీ రాత్రి కారులో సంపత్‌కుమార్‌ను ఎక్కించుకుని మద్యం తాగుదామంటూ కర్నాటక రాష్ట్రం చింతలపల్లికి వెళ్లే రోడ్డు వైపు తీసుకెళ్లారు. అక్కడే తారురోడ్డు పక్కన ఉన్న కాలువ దగ్గరకు తీసుకెళ్లి ముందస్తు పథకం ప్రకారం బీరు తాగించి ఆ బీరు సీసాలతో సంపత్‌కుమార్‌ను పొడిచారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న బాకులు, కత్తులు, కొడవళ్లతో పొడి హత్య చేశారు. సంపత్‌కుమార్‌ మరణించాడని తెలుసుకున్న తర్వాత అతని మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని ధర్మవరం చెరువు రెండో మరువ వద్దకు తీసుకొచ్చి కంపచెట్లలో పడేసి వెళ్లిపోయారు. మే 30వ తేదీన ఉదయం అనంతపురంలో న్యాయవాది కష్ణారెడ్డి క్లర్క్‌ నరేంద్ర వద్దకొచ్చి రామంజి రూ.10లక్షలు నగదు తీసుకున్నాడు. అనంతపురంలో కారు వదిలేసి అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. హతుడు సంపత్‌కుమార్‌ తండ్రి రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అనుమానితులైన కృష్ణారెడ్డి వైపు నుంచి దర్యాప్తు చేపట్టగా హత్య విషయం బయట పడింది. ఇందులో భాగంగా హత్య చేసిన రామంజి, అనుచరులు శ్రీనివాసులు, రవీంద్ర, లోకేష్‌, శ్రీకాంత్‌లను కనగానపల్లి మండలం మామిళ్లపల్లి క్రాస్‌ వద్ద మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7లక్షల నగదు, కత్తులు, కొడవళ్లు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా హత్య కేసును చేధించిన డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ సుబ్రమణ్యం, హిందూపురం వన్‌టౌన్‌ సిఐ శ్రీనివాసులు, సిబ్బందిని ఎస్సీ మాధవరెడ్డి అభినందించారు.

➡️