Oct 1,2024 08:34

25 శాతం సబ్సిడీతో రబీ విత్తనం

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

      అక్టోబర్‌ నుంచి రబీ ప్రారంభం అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రబీకి సంబంధించి విత్తన ధరలను నిర్ణయించింది. దీంతో సబ్సిడీని ఖరారు చేసింది. రబీలో అనంతపురం జిల్లాలో అత్యధికంగా సాగయ్యేది పప్పుశనగ పంట. దీనికి సంబంధించి విత్తన కేటాయింపులతోపాటు సబ్సిడీని 25 శాతం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రబీలో సాధారణంగా రెండు లక్షల ఎకరాల్లో పప్పుశనగ పంట సాగవుతుంది. అందులో అత్యధికంగా అనంతపురం జిల్లా పరిధిలోని నల్లరేగడి భూములున్న ప్రాంతాల్లో పప్పుశనగ పంటను రైతులు సాగు చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది 27,139 క్వింటాళ్లు సబ్సిడీ పప్పుశనగను కేటాయించగా, సత్యసాయి జిల్లాకు 1143 క్వింటాళ్లు కేటాయించింది. ఈ మేరకు పప్పుశనగ అవసరమైన రైతులు క్రిషీ యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత నాన్‌ సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాక రైతులకు విత్తనాన్ని అందజేస్తారు.

25 శాతం సబ్సిడీ

          రబీలో రెండు రకాలైన పప్పుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో జెజి-11 రకం ఒకటి కాగా, కాబులి రకంగా మరోకటి. జెజి-11 రకం పూర్తి ధర క్వింటాళు రూ.94 వేలు కాగా, సబ్సిడీ 25 శాతం రూ.2350 పోనూ రైతు చెల్లించాల్సింది రూ.7050 ఉంటుంది. కాబూలి రకమైతే క్వింటా పూర్తి ధర రూ.12,100 కాగా సబ్సిడీ రూ.3025 పోనూ రూ.9075 రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ రైతులకైతే 90 శాతం సబ్సిడీతో అందివ్వనున్నారు. ఈ విత్తనాలు 20 కిలోలు ఒక ప్యాకెట్‌ వస్తాయి. వీటిని అర ఎకరంలోపు ఉంటే ఒక బస్తా ఇస్తారు. ఎకరాలోపుంటే రెండు బస్తాలు, ఒకటిపైన ఒకటిన్నర ఎకరా వరకు భూమి ఉన్నరైతులకు బస్తాలు, రెండు ఎకరాల్లోపు ఉంటే నాలుగు బస్తాలు, రెండున్నర వరకుంటే ఐదు, మూడు ఎకరాలుంటే ఆరు బస్తాలు, మూడున్నర ఎకరా ఉంటే ఏడు బస్తాలు, నాలుగున్నర వరకుంటే ఎనిమిది, ఐదు ఎకరాల వరకుంటే పది బస్తాల వరకు గరిష్టంగా ఇస్తారు.

రబీలోనైనా కలిసొచ్చేనా..?

          వర్షాధారం మీద ఆధారడి సాగయ్యే ఈ పంటలకు ప్రకృతి సహకారం ఏ మేరకు లభిస్తుందో చూడాల్సి ఉది. ఖరీఫ్‌లో వర్షాలు పడినప్పటికీ సరైన సమయంలో పడకపోవడంతో ఆశించినంత దిగుబడి లేకుండాపోయింది. ఇక రబీ ప్రారంభానికి ముందు సెప్టంబరులోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. గడిచిన రెండు, మూడు రోజులుగా మేఘావృతమై ఉండి స్వల్పంగా వర్షాలు పడుతున్నాయి. ఒక మంచి పదునయితే రబీకి రైతులు సమాయత్తం అయ్యేందుకు వీలుంటుంది.

➡️