ప్రజలకు కూటమి ‘షాక్’
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాం.. ప్రజలపై ఈ ప్రభుత్వం వేసిన భారాలను అన్నీ తగ్గించి అండగా ఉంటాం’ అంటూ ఎన్నికల ముందుకు కూటమి నాయకులు ఇచ్చిన హామీ నీటిమూట అయ్యింది. ట్రూ అప్ పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారం వేసింది. అధికారంలోకి వచ్చిన మూన్నెళ్లకే విద్యుత్ ఛార్జీల పెంచి సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నడ్డివిరిచింది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు విద్యుత్ ఛార్జీల భారం మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా తయారైంది. విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
విద్యుత్ పంపిణీ సంస్థలు వాటికయ్యే ఖర్చు, వస్తున్న ఆదాయం మధ్యనున్న వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు అంటూ ట్రూఅప్ పేరుతో అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. గత ప్రభుత్వం ఇదే విధానాలను అవలంభించింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి వీటిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీలు సైతం ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఆ హామీని తుంగలో తొక్కి ట్రూ అప్ పేరుతో పేదలపై భారం వేసింది. ృహ వినియోగారులకు సంబంధించి ప్రస్తుతం ట్రూ ఆప్ పేరుతో విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేసింది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.1.58 పైసలు ప్రజలపై భారం పడనుంది. ప్రస్తుత నిబంధన ప్రకారం దాదాపు 18 నెలల పాటు దీనిని వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఉదాహరణకు నెలకు 30 యూనిట్లకన్నా తక్కువగా వాడేవారు ఇప్పుడు యూనిట్‌కు రూ.1.90 పైసల చొప్పున చెల్లిస్తుండగా ఇకపై రూ.2.73 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారిపై దాదాపు 44 శాతం అదనపు విద్యుత్ భారం పడనుంది.
ప్రజల మండిపాటు
విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు ట్రు అప్ భారాలు వేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఇప్పటికే సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టి నిరసన తెలిపారు. భవిష్యత్తులో కూడా వీటిపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తామంటూ ఆ పార్టీ తెలియజేసింది. ఇప్పటికే ధరాభారాలతో సతమతం అవుతుంటే ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో విద్యుత్ ఛార్జీల రూపంలో మరో భారాన్ని మోపడంపై సామాన్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసహరించుకోవానే డిమాండ్ ప్రజలందరి నుంచి వ్యక్తం అవుతోంది.
విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించాలి
వి.రాంభకూపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి.
ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.6,072 కోట్ల భారాన్ని విధిస్తూ ఎపి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ధరల పెరుగుదల, మరోవైపున ఉపాధి లేక ఆదాయాలు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇలా విద్యుత్ భారం మోపడం అమానుషమన్నారు. ఏనాడో వాడిన కరెంటుకు ఏళ్లు గడిచిపోయాక అదనంగా ఛార్జీలు చెల్లించాలన్న ఈఎఫ్‌పిపిసిఎ (ట్రూఅప్) విధానం మోసపూరితమైనదన్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశిత విద్యుత్ సంస్కరణల్లోని దుర్మార్గమైన షరతుల్లో ఇది ముఖ్యమైనదని చెప్పారు. 2022-23లో వాడిన కరెంటుకు ఈ నవంబర్ నెల నుంచి 2026 జనవరి వరకు కొన్ని నెలల్లో యూనిట్‌కు దాదాపు 83 పైసల వరకూ అదనంగా చెల్లించాలని తాజా ఉత్తర్వు ఇవ్వడం విద్యుత్ వినియోగదార్లందరిపై భారం వేయడమే అన్నారు. అధికారంలోకి వస్తే ‘విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం… ‘విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తాం.. అని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం తగ్గించడం సంగతలా ఉంచి ఇప్పుడు అమాంతం 44 శాతం పెంపుదలకు పూనుకోవడం దారుణ అన్నారు. షార్ట్‌టర్మ్ కొనుగోళ్ల పేరుతో గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించడం గర్హనీయ అన్నారు. మాటతప్పి ప్రజలపై వేసిన ట్రూఅప్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.