Nov 8,2024 08:44

పల్లెకు ‘బెల్ట్‌’ కిక్కు..!

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

      గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పద్ధతికి స్వస్తి చెప్పి ప్రయివేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా షాపులను అప్పగించింది. టెండర్ల ద్వారా షాపులను దక్కించుకున్న వ్యాపారులు వారు పెట్టిన మొత్తాన్ని వీలైనంత త్వరగా రాబట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో బెల్టుషాపులకు తెరతీశారు. షాపులు దక్కించుకున్న తర్వాత అనుకున్న స్థాయిలో వ్యాపారాలు లేవన్న సాకుతో బెల్టుదారి పట్టారు. షాపులు దక్కించుకున్న వారు ఎక్కువ మంది కూటమి నాయకులే కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెల్టుతో గ్రామాల్లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.

       టెండర్ల ద్వారా మద్యం షాపులను దక్కించుకున్న వారు ఇప్పటికే మద్యం షాపులను ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని షాపులకు కొంత అధికార పార్టీ నేతల నుంచి అడ్డంకులు వచ్చినా, ప్రస్తుతం అన్ని సద్దుమణిగాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని మద్యం షాపులూ ఇప్పటికే ప్రారంభం అయ్యి అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం పాలసీ ప్రకారం ముందుగా చెప్పిన దాని కంటే కమీషన్‌ గణనీయంగా తగ్గించారనే అభిప్రాయాలు విన్పిస్తున్నాయి. రోజువారీగా జరిగిన వ్యాపారంలో 20 శాతం కమీషన్‌ భావించగా ఇది అమలు జరగనట్లు తెలుస్తోంది. దీనికి తోడు వ్యాపారాలు కూడా గతంలాగా జరగలేదనే భావన వ్యాపారుల నుంచి విన్పిస్తోంది. షాపు దక్కించుకున్న ప్రతి ఒక్కరూ ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.60 లక్షలు వరకు చెల్లంచాలి. వీటికి అదనంగా ఇతర ఖర్చులూ ఉంటాయి. షాపులు దక్కించుకున్న వారు రూ.60 లక్షలు తీరిన తర్వాతనే లాభాల్లోకి వస్తారు. అంటే ప్రతి రోజు సరాసరి రెండు లక్షల రూపాయలకు తగ్గకుండా వ్యాపారం జరిగితేనే వారు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.

బెల్టుషాపుల ఏర్పాటు

      పెద్ద మొత్తంలో డబ్బులు ఆర్జించాలని భావిస్తున్న మద్యం వ్యాపారులు బెల్టుషాపులకు తెరతీశారు. వారి పరిధిలో బెల్టుషాపులను ప్రోత్సహించి గ్రామాల్లో మద్యం అమ్మకాలకు తెరలేపారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో అనధికారంగా బెల్టుషాపులు ఏర్పాటై అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. బెల్టుషాపులు నిర్వహిస్తే మద్యం అమ్మకాలు పెరిగి రోజుకు వారు అనుకున్న మేరకు రూ.2 లక్షల వ్యాపారం జరుగుతుందనే భావన వ్యాపారుల్లో ఉంది. ఇప్పటికే కొందరు బెల్టు ప్రారంభించి అమ్మకాలు చేస్తుండగా మరికొందరు ఎక్సైజ్‌, పోలీసులు, అధికార పార్టీ నాయకులతో మాట్లాడి పల్లెల్లో ఈ షాపులను ఏర్పాటు చేస్తున్నారు.

అధికార పార్టీ కన్నుసన్నల్లోనే..

         గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణకు సంబంధించిన వ్యవహారం అంతా ఆయా నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు ఎవరి పేరుత చెబితే వారే ఆ గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించేలా తీర్మానాలు సైతం చేశారు. ఓ వైపు నేతలు, మరోవైపు అధికారులను ప్రసన్నం చేసుకుని ఇప్పటికే పల్లె బెల్టుషాపుల నిర్వహణను ప్రారంభించేశారు. పెద్దపెద్ద పంచాయతీల్లో బెల్టుషాపుల కోసం పోటీ ఉంటే షాపుల నిర్వాహకులు ముందస్తు డిపాజిట్‌ను వేలం పాటలను నిర్వహించి షాపులను అప్పగిస్తున్నారు.

పల్లె జీవనంపై ప్రభావం

       గ్రామాల్లో బెల్టుషాపులు ఏర్పాటు చేయడం ద్వారా పల్లె జీవనంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రోజంతా కష్టపడి పని చేసిన సొమ్మతంతా మద్యానికే ఖర్చు చేస్తారని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో బెల్టుషాపులకు వ్యతిరేకంగా మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. రెక్కల కష్టాన్ని తాగేసే బెల్టుషాపులపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఎక్సైజ్‌, పోలీసులు స్పందించి గ్రామాల్లో బెల్టుషాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణులు కోరుతున్నారు.

➡️