అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

Sep 30,2024 22:31

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్మికులు

                 పుట్టపర్తి క్రైమ్‌ : కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిఐటియు నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ, బోనస్‌, పబ్లిక్‌ సెలవులు, పే స్లిప్పులను, పీఎఫ్‌, ఐఎస్‌ఐ, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. చెన్నేకొత్తపల్లి, పెనుగొండ, సోమందేపల్లి, గోరంట్ల, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, పరిగి, మడకశిర ప్రాంతాలలో ఉన్న కియా వాటి అనుబంధ పరిశ్రమలు అలాగే గార్మెంట్‌ పరిశ్రమలలో సుమారు 1.20 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. వీరితోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు సుమారు 20 వేలు మందికి పైగా ఉన్నారన్నారు. వీరందరికీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్‌, జగన్‌, నాగార్జున, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️