విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు
ముదిగుబ్బ : మండలంలోని గుడంపల్లి తండా దగ్గర నిర్మిస్తున్న జిల్లేడు బండ సాగు తాగునీటి ప్రాజెక్టును పున: పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని వైసిపి నాయకులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాల నాయకులు ప్రాజెక్టు నిర్మాణ కోసం ప్రయత్నించి వదిలేశారన్నారు. అయితే వైసిపి ప్రభుత్వం ప్రజలకు సాగు తాగునీరు అందించే సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. దాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రాజెక్టుపై నిరుత్సాహపరిచి రైతులకు అందవలసిన పరిహారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైసిపి మండల కన్వీనర్ సివి నారాయణరెడ్డి, సర్పంచి లక్ష్మీదేవి చెన్నరాయుడు, బధనాంపల్లి సర్పంచి వెంగల్ రెడ్డి, పరంధామ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.