పింఛను పాట్లు..!

చిలమత్తూరు సచివాలయం వద్ద పింఛన్‌ కోసం వేచి ఉన్న వృద్ధులు

       అనంతపురం ప్రతినిధి : సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవుల పాట్లు అన్నీఇన్నీ కావు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేపడతారని చెప్పడంతో ఉదయాన్నే సచివాలయాల వద్దకు లబ్ధిదారులు అందరూ చేరుకున్నారు. సచివాలయాలకు పింఛను డబ్బులు చేరలేదు. దీంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైన ఎండవేడిమి మధ్య సచివాలయాల వద్ద ఉండలేక ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల కోడ్‌ ముందు వరకు ప్రతి నెలా 1వ తేదీ ముందే రోజే సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకునేవారు. ఉదయాన్నే పింఛన్‌ లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి వాలంటీర్ల చేత డబ్బుల పంపిణీ చేయించేవారు. ఎన్నికలు సమీపించడంతో వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో సచివాలయాల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రాత్రికి కూడా డబ్బులు సచివాలయ సిబ్బందికి చేరలేదు. దీంతో సచివాలయ సిబ్బంది బుధవారం ఉదయం నుంచి పింఛను పంపిణీకి అవసరమైన డబ్బుల కోసం బ్యాంకుల వద్దకెళ్లారు. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమకాకపోవడంతో సిబ్బంది బ్యాంకుల వద్ద, వృద్ధులు సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మండుటెండల్లో పింఛను ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూస్తూ కూర్చోండిపోయారు. మధ్యాహ్నం మూడు గంటలకుపైన కొంత మంది డబ్బులు జమవడంతో డ్రా చేసుకుని సచివాలయ సిబ్బంది సాయంత్రం ఐదు గంటల నుంచి పంపిణీ ప్రారంభించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తంగా మొదటి రోజు 25 శాతం వరకు పింఛన్లు పంపిణీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

25 శాతం వరకు పంపిణీ

అనంతపురం జిల్లాలో మొత్తం 2,89,131 మంది సామాజిక పింఛను లబ్దిదారులు ఉన్నారు. వీరందరికి కలిపి రూ.86.58 కోట్లు పింఛను డబ్బులు అందాల్సి ఉంది. సాయంత్రానికి బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకున్న సచివాలయ సిబ్బంది 25 శాతం మంది వరకు పంపిణీని పూర్తి చేశారు. సత్యసాయి జిల్లాలో 2,72,767 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో 65 వేల మంది వరకు మొదటి రోజు పంపిణీ పూర్తయింది. దాదాపుగా ఇక్కడ కూడా 25 శాతం మందికి పంపిణీ చేసినట్లు అధికారులు తెలియజేశార. పుట్టపర్తి పట్టణానికి సంబంధించి యూనియన్‌ బ్యాంకులో డబ్బులు జమకాలేదు. దీంతో అక్కడ బుధవారం నాడు పింఛను పంపిణీ చేయనున్నారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పంపిణీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈనెల 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.

నీరు..నీడ కరువు

       పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయాల వద్ద చేపట్టడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ వేడమికి కనీసం కూర్చొవడానికి స్థలం లేక అల్లాడిపోయారు. తాగేందుకు నీరు లేక గొంతు తడారిపోయింది. ఏ సచివాలయంలో కూడా అధికారులు నీడ కోసం సేమియానా, తాగునీటి వసతి కల్పించలేదు. పెద్ద సంఖ్యలో వృద్ధులు, మహిళలు సచివాలయం వద్దకు వస్తారని ముందుగా తెలిసినా అధికారులు వారి కోసం నీడ, నీటి వసతి ఏర్పాటు చేకపోవడంపై పింఛన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️