ప్రభుత్వ విధానాలపై ప్రజాపోరు

Nov 13,2024 22:27

కదిరిలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

                       కదిరి టౌన్‌ : ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఈనెల 8 నుండి 14 వరకు చేపట్టిన ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్లగుట్ట వీధి కమిటీ ఆధ్వర్యంలో 32, 33, వార్డులలో పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు జగన్మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలు అయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఉచిత ఇసుక, విద్యుత్‌ ఛార్జీల భారం గురించి ప్రజలకు వివరించారు. ప్రజాపోరు లో భాగంగా ఈనెల 14వ తేదీన మండల కార్యాలయం వద్ద చేపట్లే ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్‌, ఫాజిల్‌, కృష్ణానాయక్‌, బబ్లూ, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు. నల్లచెరువు : సిపిఎం చేపట్టిన ప్రజాపోరులో భాగంగా ఈనెల 14వ తేదీన కలెక్టర్‌ కార్యాలయం వద్ద, మండల కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,మండల కార్యదర్శి రామకృష్ణ కోరారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ప్రజా పోరు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల అదుపునకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలను పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మాట మార్చి నేడు ప్రజలపై వేల కోట్ల రూపాయలను ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో భారం వేయడం అన్యాయమన్నారు.

➡️