పోలీసులు బాలయ్య పిఎల చేతిలో కీలుబొమ్మలు : వైసిపి

Apr 14,2025 21:53

విలేకరుల సమావేశంలో పాల్గొన్న వైసిపి నాయకులు, బాధితులు

                     హిందూపురం : పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణ పిఎల చేతిలో కీలుబొమ్మలుగా మారారని వైసిపి నాయకులు వేణురెడ్డి విమర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి రోజునే పోలీసులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఓ కేసులో బీసీ ఎస్సీ నాయకులను బేడీలు వేసి నడిరోడ్డులో నడిపించి తీసుకెళ్లడం అమానవీయమని,ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సోమవారం సాయంత్రం వైసిపి నాయకులు, దళిత నాయకులు, అరెస్ట్‌ కాబడిన బీసీ నాయకుడు వాల్మీకి లోకేష్‌, దళిత నాయకుడు నవీన్‌ కుటుంబసభ్యులు చందన లోకేష్‌, శైలజ నవీన్‌ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవలసిన పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అవమానపరిచే విధంగా నడిరోడ్డులో బీడీలు వేసి పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లడం ఎంతవరకు న్యాయమని అన్నారు. అవమానాన్ని భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తమ కుటుంబాలకు ఎవరు దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌ భార్య చందన మాట్లాడుతూ తన భర్తను పోలీసులు తీసుకెళ్లి రెండు రోజులు అయిందని ఎక్కడ పెట్టారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా తప్పే చేసి ఉంటే కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచాలన్నారు. అలాంటివేమీ చేయకుండా పోలీసులు ఎక్కడెక్కడో దాచి సోమవారం మధ్యాహ్నం బేడీలు వేసుకుని నడిరోడ్డులో నడిపించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నేత వేణు రెడ్డి, దళిత నాయకులు మాట్లాడుతూ అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అంబేద్కర్‌ జయంతి రోజు దళిత, బీసీ కులానికి చెందిన నాయకులను నడిరోడ్డుపై బేడీలతో తీసుకెళ్లడం ఎవరి మెప్పు కోసమని ప్రశ్నించారు. హిందూపురం నియోజకవర్గం లో పోలీసులు బాలయ్య పిఎ ల చేతిలో కీలుబొమ్మల వ్యవహరిస్తున్నారన్నారు. వాస్తవానికి మోహన్‌ అనే వ్యక్తిపై కొంతమంది మద్యం సేవిస్తూ బార్‌ లో దాడులు చేసుకున్నారు. ఈ దాడికి ఎటువంటి సంబంధం లేకపోయినా వాల్మీకి లోకేష్‌, దళిత నాయకుడు నవీన్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం అంబేద్కర్‌ సర్కిల్‌ నుండి వన్‌ టౌన్‌ స్టేషన్‌ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి, స్టేషన్‌ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ ధర్నాకు వైసీపీ నాయకులతో పాటు బీసీ, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

➡️