సాగు,తాగునీరు, పరిశ్రమలకు ప్రాధాన్యత

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు, కలెక్టర్‌, జెడ్పీ ఛైర్‌పర్సన్‌

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

జిల్లాలో సాగు, తాగునీరు, పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తామని జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా ఇంఛార్జీ మంత్రి టిజి.భరత్‌, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌లు స్పష్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టిజి.భరత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, సాగునీరు, వైద్యం, ఉపాధి హామీ పనులపై సమీక్షా జరిగింది. ఈ సమావేశంలో విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌ప్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుబాటి వెంకట ప్రసాద్‌, బండారు శ్రావణి, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ ప్రారంభించాలి : కాలవ

వరి నూర్పిడి ప్రారంభమైంది…ఇప్పటికీ ధాన్యం సేకరణ ప్రారంభమవలేదు.. కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని విప్‌ కాలవ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం సేకరణ ప్రారంభిస్తే మార్కెట్‌లో రైతుకు కొంత ధర లభించే అవకాశముందని ఆయన తెలిపారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పందిస్తూ నూర్పిడి ప్రారంభమయ్యే సమయానికి ధాన్యం సేకరణ చేపట్టాలని జిల్లా సివిల్‌ సప్లై జిల్లా మేనేజరుకు ఆదేశించారు. రాయదుర్గంలో ప్రారంభించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు మండలాలల్లో కొన్ని మండలాలు లేకుండా పోవడంపై కాలవ శ్రీనివాసులుతోపాటు, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అధికారుల మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి పయ్యాల కేశవ్‌ స్పందిస్తూ మరో మారు అన్ని అంశాలను పరిశీలించి కొత్తగా చేర్చడానికి ఏదైనా అవకాశాలుంటే ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.

హంద్రీనీవా మొదటి దశ వెడల్పు, రెండో దశ లైనింగ్‌ సాగునీటి రంగంపై జరిగిన చర్చలో మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాకు సాగునీటిని అందివ్వాలన్నది ప్రధాన లక్ష్యం అని చెప్పారు. అందులో భాగంగా హంద్రీనీవా మొదటి దశ కాలువ వెడల్పును 3800 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం చేసిందని చెప్పారు. అదే విధంగా రెండో దశలో లైనింగ్‌ చేపట్టి ప్రవాహ వేగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం చేసిందన్నారు. ఈ మేరకు పనులను చేపట్టాలని ఆదేశించిందన్నారు. తుంగభద్ర డ్యామ్‌ ఎగువ ప్రధాన కాలువను మరోమారు పరిశీలించి ఎక్కడ పనులు అవసరమో ప్రతిపాదనలను పంపించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ హెచ్‌ఎల్‌ఎసి ఎస్‌ఇ రాజశేఖర్‌ను ఆదేశించారు. అదే విధంగా హంద్రీనీవా కింద 36వ ప్యాకేజీ బిటిపి, పేరూరు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ వివరాలను సమగ్రంగా రూపొందించాలని భూసేకరణ అధికారికి మంత్రి సూచించారు. పిఎబిఆర్‌ నిలువ సామర్థ్యం పూర్తి స్థాయి పెంచే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సూచించారు. దీనిపైనా కేశవ్‌ స్పందించారు. ఇప్పటికే ఆ ప్రతిపాదనలను రూపొందించడం జరిగిందన్నారు. భూసేకరణ, డ్యామ్‌ మరమ్మతులకు కలిపి రూ.400 కోట్లకుపైగా అవుతుందని దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వముందన్నారు. ఇహెచ్‌ఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రిపోర్టును రూపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆబా’ను అమలు చేసే విధంగా చూడాలన్నారు. ఈ రిపోర్టు ఉంటే మనిషి అత్యవసరాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. క్యాన్సర్‌ నిర్ధారణకు జరుగుతున్న సర్వేపై డిఎంఅండ్‌హెచ్‌ఒ వివరించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో వైద్యులకు తగ్గట్టు ఏర్పాట్లు లేవని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్‌ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడున్న 570 పకడల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని తెలిపారు.

పరిశ్రమల స్థాపనపై దృష్టి : మంత్రి టిజి.భరత్‌

         రాయలసీమ జిల్లాలో అవసరమైనంత భూమి అందుబాటులో ఉన్నందున అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే ఆజాద్‌ అనే సంస్థతోపాటు ఆక్సా అనే అతి పెద్ద సంస్థ కూడా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయని తెలిపారు. మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులిచ్చే విన్నపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. పరిష్కరించలేని పక్షంలో సమాచారాన్ని అయినా తెలియ జేయాలని ఆదేశించారు.

అవకాశం లేదనడంతో వెనుదిరిగిన మేయర్‌

          అనంతపురం నగరంలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి నగర మేయరు వసీం కలెక్టరేట్‌కు విచ్చేశారు. సమావేశం ప్రారంభానికి ముందే ఆయన అక్కడికి చేరుకున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు అవకాశం లేదని డిఆర్‌ఒ మలోలా చెప్పారు. ఈ కమిటీలో సభ్యులుగానున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. జిల్లా అభివృద్ధి కమిటీ కదా అవకాశముంటుందని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా లేదని చెప్పడంతో మేయర్‌ వసీం వెనుదిరిగి వెళ్లారు.

➡️