కబ్జా నుంచి అసైన్డ్‌ భూమిని కాపాడండి

రైతుసంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న రైతులు

ప్రజాశక్తి-ధర్మవరం రూరల్‌

అసైన్డ్‌ భూమిని కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని గరుడంపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రైతుసంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, మండల కార్యదర్శి ఆలకుంట మారుతి మాట్లాడుతూ గరుడంపల్లి గ్రామ సర్వే నెంబర్‌ 593-10లో 4.45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. అందులో స్థానిక పేద రైతులు పశువులు షెడ్లు, పశువులు మేతకి సంబందించిన దొడ్లు వేసుకుని చాలా ఏళ్ల నుంచి ఉన్నారన్నారు. కొన్నాళ్ల క్రితం సాకే నారాయణ స్వామి అనే వ్యక్తి ఆ భూమి తన పేరుపై రిజిస్టర్‌ చేయించుకున్నారన్నారు. ఏళ్ల తరబడి అక్కడున్న పేద రైతులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని దౌర్జన్య చేస్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించి ఈ అసైన్డ్‌ భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు చండ్రాయుడు, మురళి, నరసింహులు బాల పెద్దన్న, కుమార్‌, పద్మావతి, పోతలయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️