20న కేంద్ర బడ్జెట్‌పై నిరసనలు

సమావేశంలో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించాలని కోరుతూ ఈ నెల 20న సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు తెలపనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ తెలియజేశారు. మంగళవారం పుట్టపర్తి సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో కొనుగోలు శక్తి కుచించుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సమయంలో మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలివ్వడం, ఖర్చుల్లో కోత పెట్టడం తీవ్ర అభ్యంతరకరం అన్నారు. నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్‌ పూర్తిగా విస్మరించిందన్నారు. ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివద్ధి, సామాజిక సంక్షేమంపై పెట్టిన ఖర్చు గత ఏడాదికంటే తగ్గించడం విచారకరం అన్నారు. అవసరం ఉన్నప్పటికీ ఉపాధిహామీ పథకానికి నిధులు అదనంగా కేటాయించలేదన్నారు. ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుదలతో అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికవర్గాన్ని ఈ బడ్జెట్‌ విస్మరించిందన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ వామపక్ష పార్టీలు కొన్ని ప్రతిపాదనలు ప్రజల్లోకి తీసుకెళ్తోందన్నారు. అందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదాను ఉపసంహరించాలన్నారు. నేషనల్‌ మానిట్కెజేషన్‌ పైప్‌ల్కెన్‌ ద్వారా చేపట్టే ప్రభుత్వరంగ ప్రయివేటీకరణ చర్యలను, ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు రంగానికి బదలాయించడాన్ని ఆపాలన్నారు. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డిఐలను ఉపసంహరించాలన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను 50 శాతం పెంచాలన్నారు. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాలన్నారు. సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్ర కేటాయింపులు పెంచాలన్నారు. జిడిపిలో ఆరోగ్య రంగ కేటాయింపులను 3, విద్యా రంగానికి ఆరు శాతం కేటాయింపులు పెంచాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార సబ్సిడీని పెంచాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ రంగాలకు, మహిళా, శిశు సంక్షేమానికి కేటాయింపులను గణనీయంగా పెంచాలన్నారు. స్కీమ్‌ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాల్లో కేంద్రం వాటాను పెంచాలని కోరారు. రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులను గణనీయంగా పెంచాల్సి ఉందన్నారు. రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులను, సర్‌ఛార్జీలను రద్దు చేయాలన్నారు. ఈ విధానాలను ప్రజల్లో ప్రచారం చేయడం కోసం ఈ నెల 20 నుంచి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇఎస్‌.వెంకటేష్‌, జిల్లా కమిటీ సభ్యులు జెడ్‌పి.శ్రీనివాసులు, జిఎల్‌. నర్సింహులు, జంగాలపల్లి పెద్దన్న, లక్ష్మినారాయణ, ఆఫీస్‌ కార్యదర్శి సిద్ధు, శాఖ సభ్యులు పాల్గొన్నారు.

➡️