ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ
హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లను ప్రొసీడింగ్ అధికారి, పెనుగొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ తో కలిసి డిఆర్‌ఒ విజయసారథి ఆదివారం పరిశీలించారు. సభకు హాజరవుతున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు తదితర అంశాలను కౌన్సిల్ హాల్‌లో పరిశీలించారు. అదేవిధంగా పోలీసు అధికారులతో తగిన బందోబస్తు గురించి అడిగి తెలుసుకున్నారు. సోమవారం జరిగే చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజనీర్ మోహన్ పాల్గొన్నారు. ఎస్పీ పరిశీలన : సోమవారం హిందూపురం పురపాలక సంఘ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎస్పీ రత్న డిఎస్‌పి మహేష్ తో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనుమతులు లేని వాహనాలను, వ్యక్తులను అనుమతించరాదని సూచించారు. ఎన్నిక జరిగే వరకు, ఎన్నిక అనంతరం పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.