రూ.312 కోట్లతో ‘పురం’ అభివృద్ధి : ఎమ్మెల్యే

Feb 3,2025 21:21

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

                        హిందూపురం : అభివృద్ధిని ఆశించి గెలిచిన కౌన్సిలర్లు తమ వార్డుల్లో గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేపట్టలేదని, వారి వార్డులను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో స్వచ్ఛందంగా వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారనిహిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌గా రమేష్‌ కుమార్‌ ఎంపిక అనంతరం చైర్మన్‌ చాంబర్‌లో ఎంపీ పార్థసారథి, నూతనంగా ఎంపిక అయిన చైర్మన్‌ రమేష్‌ కుమార్‌, కౌన్సిలర్లతో కలిసి బాలకృష్ణ స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. తమ వార్డులను అభివృద్ధి చేయాలని ఎంతో ఆశతో గెలిచిన కౌన్సిలర్లకు నిరాశే మిగిలిందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వార్డులను అభివృద్ధి చేసుకోవాలని కొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరానని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో హిందూపురం పట్టణ అభివృద్ధి కోసం రూ. 66 కోట్లు తీసుకురావడం జరిగిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంరివర్స్‌ టెండరింగ్‌ విధానం పేరుతో మంజూరు చేసిన నిధులను విడుదల చేయలేదన్నారు. ఈ విషయంపై అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించామన్నారు. హిందూపురం అభివృద్ధికి ప్రత్యేక అనుధులు కేటాయించాలని కోరామని చెపాపరు. ఆయన సరే అని చెప్పిన వెంటనే పురం అభివృద్ధి కోసం ప్రత్యేక డిపిఆర్‌ ను సిద్ధం చేయాలని మున్సిపల్‌ శాఖ అధికారులకు ఆదేశించామన్నారు. పట్టణ వ్యాప్తంగా సిసి రహదారులతో పాటు మురుగు కాలువల ఏర్పాటు కోసం రూ 92 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు పట్టణంలో ప్రతి ఇంటికి నీటిని అందించాలని, దీనికి ప్రత్యేక పైప్‌ లైన్‌ ఏర్పాటు, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణాలు తదితర వాటికి 120 కోట్లు అవసరమని అంచనాలు సిద్ధం చేశామన్నారు. ఈ రెండు కూడా ఆర్థిక శాఖలో మంజూరు కోసం సిద్ధంగా ఉన్నాయని త్వరలో రూ. 212 కోట్లు నిధులు మంజూరు అవుతాయని చెప్పారు. దీంతోపాటు పట్టణ అభివృద్ధి కోసం మరో రూ. 100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరగా ఆయన వెంటనే అంగీకరించారని తెలిపారు. మొత్తం రూ.312 కోట్లతో హిందూపురం పట్టణాన్ని సర్వ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. దీంతో పాటు పరిశ్రమలను తీసుకొని వచ్చి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్‌ డి ఈ రమేష్‌ కుమార్‌ నందమూరి బాలకృష్ణకు, ఎంపీ పార్థసారథితో పాటు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో పట్టణాన్ని అన్ని విదాల అభివృద్ది చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అంజినప్ప, కౌన్సిలర్లు పాల్గొన్నారు.తనకు పద్మ భూషణ్‌ కాదు…. ఎన్‌.టి.ఆర్‌ కు భారతరత్న వస్తేనే సంతృప్తి తనకు పద్మభూషణ్‌ అవార్డు రావడం పై సంతృప్తి లేదని టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజా సంక్షేమ పాలనకు నాంది పలికిన నందమూరి తారక రామారావు కు భారతరత్న అవార్డు వచ్చినప్పుడే తనకు సంతృప్తి లభిస్తుందని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌ ఛాంబర్‌ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించడంపై సంతృప్తిగా లేదన్నారు. తనకన్నా నటనలో ఎంతో గొప్ప వ్యక్తి, పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారం చేపట్టి ప్రజా సంక్షేమ పాలనకు నాంది పలికిన ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌ కు భారతరత్న ప్రకటిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎక్కడైనా తన సేవలను పార్టీ వినియోగించుకోవచ్చని అన్నారు.

➡️