నిబంధనలు అతిక్రమిస్తే అనుమతుల రద్దుకు సిఫార్సు

Feb 5,2025 21:41

వ్యర్థాలను పరిశీలిస్తున్న అధికారులు

                     హిందూపురం : హిందూపురం రూరల్‌ మండలం తూముకుంట, గోళాపురం పారిశ్రామిక వాడల్లో ఉన్న పరిశ్రమ నిర్వాహకులు కాలుష్య నియంత్రణ శాఖ నిబంధనలు అతిక్రమిస్తే, అలాంటి పరిశ్రమల అనుమతుల రద్దు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని కాలుష్య నియంత్రణ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ముని ప్రసాద్‌ హెచ్చరించారు. కాలుష్య కాటు అనే శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ముని ప్రసాద్‌ పారిశ్రామిక వాడలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పరిశ్రమ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు, కార్మిక సంఘం నాయకులు, పర్యావరణవేత్తలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ముని ప్రసాద్‌ వ్యర్థాలను వేసిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ, రసాయన పరిశ్రమల నిర్వాహకులు తప్పనిసరిగా ఈటిపిసి ని వినియోగించాలన్నారు. పర్యావరణ శాఖ అధికారులతో పాటు ప్రభావిత గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, పర్యావరణవేత్తలతో పాటు కార్మిక సంఘం నాయకులతో కలిపి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీ ప్రతి నెల పరిశ్రమలతో పాటు వ్యర్థాలను వేసిన ప్రాంతాలను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ అధికారులకు అందించడం జరుగుతుందన్నారు. దీంతోపాటు పారిశ్రామిక వాడలో కొన్ని ప్రాంతాలను గుర్తించి నిత్యం పరిశీలించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ అధికారులతో పాటు ప్రభావిత గ్రామస్తులు, పర్యావరణ వేత్త భాస్కర్‌ రెడ్డి, రసాయన పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు.

➡️