కదిరిలో ఆక్రమణల తొలగింపు

జెసిబిలతో అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్న రెవెన్యూ సిబ్బంది

      కదిరి టౌన్‌ : కదిరిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అధికారుల్లో కదలిక వచ్చింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆదేశాల మేరకు ఆక్రమ కట్టడాల తొలగింపునకు సోమవారం ఉపక్రమించారు. కదిరి పట్టణం గట్లు సమీపాన ముత్యాల చెరువు గ్రామ పొలం సర్వే నెంబర్‌ 87-2లో కోట్లు విలువచేసే 30 సెంట్లు ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ప్రజాశక్తిలో ఆదివారం నాడు ‘ఆక్రమించి.. దర్జాగా నిర్మించు’..! అన్న శీర్షికన కథనం ప్రచురితం అయ్యింది. కదిరి పట్టణంలో జరుగుతున్న ఆక్రమణలపై ఇతర పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే కందికుంట స్పందించారు. ముత్యాల చెరువు గ్రామ పొలం సర్వే నెంబర్‌ 87-2లో ప్రభుత్వ స్థలంను ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాలను తొలగించాలని తహశీల్దార్‌ పుల్లారెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం ఉదయం అక్కడికి చేరుకుని జెసిబితో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఆక్రమణకు గురైనా వెంటనే మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు స్పందించి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. కబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమలన్నింటినీ స్వాధీనం చేసుకునేలా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై స్పందించి చర్యలకు ఉపక్రమించడంతో ప్రజాసంఘాల నాయకులు జిఎల్‌.నరసింహులుతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

➡️