‘సత్యసాయి’ పైప్‌లైన్‌ లీకేజీ

Mar 25,2025 22:25

 కల్వర్టు కింద విరిగిన పైప్‌ లైన్‌ జాయింట్‌ కప్లింగ్‌

                 బత్తలపల్లి : బత్తలపల్లి- అనంతపురం జాతీయ రహదారి మధ్యలో పుట్టపర్తికి వెళ్లే సత్యసాయి తాగునీటి పథకం ప్రధాన పైపులైన్‌ లీకేజీ అవుతుండడంతో దాదాపు 30 గ్రామాలకు సత్యసాయి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. చిత్రావతి నది నుండి సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి వెళ్లే ప్రధాన పైప్‌లైన్‌ బత్తలపల్లి మీదుగా వెళ్తోంది. బత్తలపల్లి నుండి అనంతపురం వరకు నిర్మించిన నాలుగు లైన్ల రహదారి క్రింద ప్రధాన పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. బత్తలపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపాన జాతీయ రహదారి కల్వర్టు క్రింద ప్రధాన పైప్‌లైన్‌ జాయింట్‌ కప్లింగ్‌ విరిగిపోవడంతో నీరు లీకేజీ అవుతోంది. గుర్తించిన సిబ్బంది జాతీయ రహదారి మధ్యలో సుమారుగా 20 అడుగుల లోతు త్రవ్వి కల్వర్టు కింద ఉన్న పైప్‌ లైన్‌ లీకేజీని గుర్తించారు.గత మూడు రోజులుగా సత్యసాయి తాగునీటి పథకం సూపర్వైజర్లు శంకరయ్య, రాజారెడ్డి పర్యవేక్షణలో దాదాపు 20మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు సత్యసాయి తాగునీటి పథకం నీరే ప్రధాన దిక్కు. అసలే వేసవి కాలం కావటంతో పలు గ్రామాలలో నీటి సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో సత్యసాయి నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాల్లోని పలు గ్రామాలలో సత్యసాయి నీరు నిలిచిపోయిందని మంగళవారం రాత్రికి పైప్‌లైన్‌ లీకేజీకి మరమ్మతు చేసి బుధవారం సత్యసాయి నీరు అందేలా చూస్తామని సూపర్వైజర్లు పేర్కొన్నారు.

➡️