నీట్‌ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Jun 11,2024 22:07

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి

                హిందూపురం : 2024 నీట్‌ పరీక్ష ఫలితాల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి, విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని బిసి వసతిగృహం వద్ద బాబావలి మాట్లాడుతు 2024 నీట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టిన ఎన్‌టిఎ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్ష ఫలితాలలో ఒకే పరీక్ష కేంద్రం ఉన్న ఒకే సీరియల్‌ నెంబర్లతో కూడిన ఉన్న విద్యార్థులకు ర్యాంకులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. లక్షలాదిమంది విద్యార్థులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కనుక నీట్‌ పరీక్ష నిర్వహణ ఎన్‌టిఎ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జయచంద్ర, ప్రదీప్‌, బాబాఫక్రుద్దీన్‌, సుభాష్‌, హేమంత్‌, శశి కుమార్‌, నాగరాజు, రోహిత్‌ పాల్గొన్నారు.

➡️