డిఎఒకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి -పెనుకొండ టౌన్
సాగుభూములను నాసన్, బెల్ పరిశ్రమల కోసం ఇచ్చిన భూ నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాసం, ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ విమర్శించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బుధవారం రెండవ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, మహిళా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దిల్షాద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా స్థాయి అధికారులు నిర్వాసితులకు పునరావాసం ఇవ్వకపోవడం సరికాదన్నారు. మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పాలకులు మాటలు చెప్పడం కాకుండా ఆచరణలో నిర్వాసితులకు పునరావసం ఇచ్చేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రికి నియోజకవర్గంలో అన్ని సమస్యలూ కనిపిస్తున్నా నిర్వాసితుల సమస్యలు కనిపించకపోవడం విచారకరం అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉండి పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో నిర్వాసితులు డిఎఒ గిరికి వినతిపత్రం అందించారు. ఈ సమస్యను ఫోన్ ద్వారా డిఆర్‌ఒ భాగ్యరేఖ దృష్టికీ తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డిఆర్‌ఒ పది రోజుల్లో నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారి హామీ మేరకు ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించారు. పది రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకపోతే నిర్వాసితులతో కలిసి పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కొండా వెంకటేశులు, సిపిఎం నాయకులు రామాంజనేయులు, భూ నిర్వాసితులు వెంకట లక్ష్మమ్మ, అచ్చమ్మ, వెంకటరామిరెడ్డి, వెంకట్రాముడు, గంగమ్మ, నరసమ్మ, కదిరప్ప, మారుతి పాల్గొన్నారు.