బియ్యం, కోడిగ్రుడ్లు తరలిస్తున్న దృశ్యం
నంబులపూలకుంట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వినియోగించాల్సిన మధ్యాహ్నభోజన పథకం సరుకులు పక్కదారి పడుతున్నాయని సిపిఎం మండల నాయకులు గంగిరెడ్డి,మల్లిరెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆదివారం సెలవు రోజు మధ్యాహ్న భోజనం సరుకులు, సామాగ్రి ఉన్న గదిని తెరిచి నాలుగు బస్తాల బియ్యం,360 కోడి గుడ్లు తరలిస్తుండగా పాఠశాల కమిటీ చైర్మన్ అడ్డుకున్నారని తెలిపారు. సరుకులు తరలిస్తున్న వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సెలవు దినాలలో పాఠశాలకు సంబంధించిన తాళం చెవులు ఎవరు దగ్గర వుంచుకోవాలంటూ వారు ప్రశ్నించారు. సాధారణంగా మధ్యాహ్న భోజనం పాఠశాలలో చేయిస్తారా లేకుంటే ఇంటి వద్ద నుంచి చేసుకుని వచ్చి విద్యార్థులకు వడ్డిస్తారా అంటూ ప్రశ్నించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ రోజు మెనూ ప్రకారమా వంట చేయాల్సుందన్నారు.కానీ ఇక్కడ మాత్రం ఎంత మంది విద్యార్థులు వస్తారనే విషయం తెలియకుండానే బియ్యం,గుడ్లు ఏవిధంగా ఇస్తారన్నారు. అంతేకాకుండా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యా బోధనపై దృష్టిసారించాలని రాజకీయాలు చేయరాదని కూటమి నాయకులు షేక్ బాబ్జాన్ హితవు పలికారు. మధ్యాహ్నభోజనం సరుకులు పక్కదారి పట్టిన విషయాన్నికలెక్టరు దష్టికీ తీసుకెళతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జి రమణ,చాంద్ బాషా,కొవ్వూరు వెంకటరమణ, రామమోహన్, సిఐటియు నాయకులు నాగరాజు,రమణ తదితరులు పాల్గొన్నారు.