నేరాల నియంత్రణపై దృష్టి : ఎస్పీ

స్టేషన్లో రికాకార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ రత్న

ప్రజాశక్తి-బత్తలపల్లి

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వి.రత్న పోలీసు సిబ్బందికి సూచించారు. బత్తలపల్లి పోలీస్‌ స్టేషన్‌ను శనివారం ఆమె తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌లో రిసెప్షన్‌ కౌంటర్‌, రికార్డుల నిర్వహణ, లాకప్‌ గదులు, పోలీసు స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లో పట్టుబడి ఉన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలు కేసుల వివరాలను ఎస్‌ఐ శ్రీనివాసులుతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌ కేసులపై నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో ముమ్మురంగా పెట్రోలింగ్‌ చేయడంతో పాటు గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పల్లెనిద్ర చేయడంతో పాటు సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మట్కా, పేకాట, గంజాయి, నాటసార తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

➡️