భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌

ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యలపై అవగాహన పెంపొందించుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డిఆర్‌ఒ విజయ సారథిలతో కలిసి ఆర్డీవోలు తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి గ్రామసభల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ, రెవెన్యూ గ్రామానికి సంబంధించి గ్రామసభ షెడ్యూల్‌ను సిద్ధం చేయాలన్నారు. గ్రామ సచివాలయం పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు గ్రామ సభ నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో స్వీకరించే సమస్యలను సంబంధిత తహశీల్దార్‌ వీఆర్వోలు అవగాహన చేసుకుని వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సంబంధిత ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో తహశీల్దార్ల పనితీరుపై పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు పదేపదే వస్తున్న కారణంగా వాటి పరిష్కారానికి రెవెన్యూ సిబ్బంది కషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల వీఆర్వోలదే ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా వినతులను స్వీకరించిన వెంటనే సంబంధిత శాఖలకు పిజిఆర్‌ఎస్‌ పోర్టల్‌ ద్వారా పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. వారంలో నాలుగు రోజులు ఆయా గ్రామాల్లో తహశీల్దార్‌ నేతత్వంలో గ్రామసభలు నిర్వహించాలన్నారు. సోమవారం, సాధారణ సెలవులు మినహా గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజలు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. గ్రామ మండల స్థాయిలో సమస్యలు పరిష్కరించలేనివి మాత్రమే జిల్లా కేంద్రానికి ఫిర్యాదులు రావాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు భూ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. వివిధ దినపత్రికలలో వచ్చిన ప్రతికూల వార్తలపై సంబంధిత శాఖ అధికారులు సమగ్ర సమాచారంతో ఎప్పటికప్పుడు రిజాండర్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా షోకాజు నోటీసులు జారీ చేస్తామన్నారు. జలవనరుల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని జిల్లాలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి పోలీస్‌ స్టేషన్ల వివరాలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

➡️